- సిటీలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
- ఈజీ మనీ వేటలో యూత్
- వేలు, లక్షల్లో పందెం
వరంగల్, వెలుగు: ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్ స్టార్ట్ అవుతోందంటే ఎక్కడికక్కడ యూత్ అలెర్ట్ అయిపోతున్నారు. సాయంత్రమైందంటే చాలు టీవీలు, స్మార్ట్ ఫోన్లు ముందు పెట్టుకొని బెట్టింగులు షురూ చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన చాలామంది ఈ బెట్టింగుల్లో పైసలు పెడుతుండగా.. ఈ తతంగం అంతా నడిపించడానికి ఓరుగల్లు నగరంలో ఏరియాకో మీడియేటర్ పనిచేస్తున్నారు. చైన్ సిస్టంగా పనిచేస్తున్న మీటియేటర్ల బారిన పడి సిటీలో చాలామంది లాస్ అవుతున్నారు. ఇప్పటికే ఇలా బెట్టింగులకు పాల్పడుతున్న పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. కేఫ్‌లు, హోటళ్లు కేంద్రంగాబెట్టింగ్ నడుస్తుండగా.. రోజుకు లక్షల్లో చేతులు మారుస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో ఈజీగా మనీ వస్తుండడంతో చాలామంది బెట్టింగులకు అలవాటుపడుతున్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న పది మందిని అరెస్టు చేసి రూ.లక్షా 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు హన్మకొండ హౌజింగ్ బోర్డు కాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.37 వేలు స్వాధీనం చేసుకుని సుబేదారి పోలీసులకు అప్పగించారు.
గ్రామాల్లోనూ లక్షల బెట్టింగ్..
బెట్టింగ్ కల్చర్ పట్టణాలతో పాటు పల్లెల్లోకి పాకింది. గ్రేటర్ వరంగల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిలదొక్కుకున్న చాలామంది యూత్ క్రికెట్‌పై భారీ పందెం కాస్తున్నారు. ముఖ్యంగా హసన్‌పర్తి మండలం చింతగట్టు, దేవన్నపేట, ఆరెపల్లి, వంగపహాడ్ తదితర గ్రామాల్లో లక్షల్లో బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. గుడెప్పాడ్ నుంచి సిటీకి వచ్చే మార్గంలో ఉన్న ఓ హోటల్లో రోజూ సాయంత్రం బెట్టింగ్ ముఠా తిష్ట వేసి అంతా నడిపిస్తున్నట్లు తెలిసింది. ఇదంతా గుట్టుగా సాగుతుండటంతో ఏరోజుకారోజు వేల నుంచి లక్షల సొమ్ము చేతులు మారుతోంది.
మీడియేటర్ల హవా..
సిటీలో కొన్నిచోట్ల ఏరియాకో మీడియేటర్ తయారయ్యారు. వారంతా సాయంత్రం కాగానే కేఫ్‌లు, హోటళ్లలో అడ్డా వేసి తమకు తెలిసిన వాళ్లతో బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తున్నారు. ముఖ్యంగా సిటీలో పెట్రోల్ పంపు, కిషన్‌పుర, కేయూ క్రాస్, అలంకార్ సెంటర్, పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తా ఏరియాల్లో మీడియేటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరి బారిన పడి చాలా మంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్‌లో లాభాలు చూసే వారి కంటే డబ్బులు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువ అని ఆఫీసర్లు చెబుతున్నారు.