- మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
అమరావతి: రాష్ట్రంలో థియేటర్లు సీజ్ చేయలేదని.. అదంతా దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాలతో రాజకీయాలు చేయొద్దని, చంద్రబాబును నమ్ముకుంటే మోసపోతారని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సినిమానే కాదు.. ఎవరి సినిమాపైనా.. ఏ సినిమాపైనా ప్రభుత్వం వివక్ష చూపబోదన్నారు. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ, అల్లు అర్జున్ పుష్ప, నాగార్జున బంగార్రాజు.. విడుదలయ్యాయి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విడుదలైంది. రాష్ట్రంలో అప్పుడు ఇప్పుడు అదే నియమావళి ఉంది తప్ప కొత్తగా ఏమీ లేదన్నారు. సినిమా బాగుంటే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని మంత్రి పేర్కొన్నారు.
చిరంజీవిని జగన్ చాలా గౌరవించారు
సీనియర్ హీరో చిరంజీవిని సీఎం జగన్ చాలా గౌరవించారని, ఆయనతో కలిసి భోంచేశారు, జగన్ సతీమణి భారతి స్వయంగా చిరంజీవికి వడ్డించారు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అందరికీ చెప్పారు.. కానీ కొన్ని మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోంది..పరిస్థితి అర్ధం చేసుకోండి.. వారి మాయలో పడకండి అని హితవు పలికారు. తల్లి వంటి సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టకండని పవన్‌కళ్యాణ్‌కు మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.
ఎవరి సినిమా అయినా ఒకటే.. బ్లాక్ టికెట్లను అంగీకరించేది లేదు
రాష్ట్రంలో ఎవరి సినిమా అయినా ఒకటే విధానం...బ్లాక్‌లో టికెట్లను అంగీకరించే ప్రసక్తి లేదు, ప్రజలను లూటీ చేయడాన్ని ప్రభుత్వం ఒప్పుకోదు, అది జరగకూడదని జగన్‌గారు భావిస్తున్నారని, ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం జగన్ పని చేస్తున్నారని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.
అవాస్తవాలు దుష్ప్రచారం
తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన మీడియాలలో, జనసేన నాయకులు సీఎం వైయస్ జగన్ మీద దుష్ప్రచారం చేస్తున్నారని, పవన్ సినిమా భీమ్లానాయక్ సినిమాను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారనేది అబద్దం అన్నారు. ప్రజల కోసం పని చేసిన జగన్ ను అధికారంలో నుంచి దింపాలని కుట్రలు చేస్తున్నారని, వ్యక్తులు, కులాలు, మతాల మధ్య తగాదాలు పెట్టే ప్రయత్నంలో ఎవరూ బలిపశువు కాకూడదన్నారు.
భీమ్లా నాయక్ సినిమాకు ఎలాంటి షరతులు పెట్టలేదు
అన్ని సినిమాల మాదిరిగానే భీమ్లానాయక్ సినిమాకు ప్రభుత్వం కొత్తగా ఎటువంటి షరతులు పెట్టలేదని, అఖండ, పుష్ప సినిమాలతో పాటు, నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా ఎలా చూశామో.. భీమ్లానాయక్ సినిమాను అదే విధానంలో రాష్ట్రంలో విడుదల అయ్యాయన్నారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి తొక్కేయాలని ఎవరూ అనుకోలేదు, బంగార్రాజు సినిమాకు మా క్యాబినెట్ సహచరుడు కన్నబాబు సోదరుడు దర్శకుడు, అలా అని ఏ మాత్రం వారికి మేలు చేయలేదు, ఆ సినిమా తరహాలోనే భీమ్లానాయక్ కూడా విడుదల అయింది, సీఎం జగన్ ఎక్కడా వివక్ష చూపలేదన్నారు.
ఈ దోపిడికి చంద్రబాబు కారణం కాదా?
ఇవాళ్టి దోపిడీ పరిస్థితికి కారణం చంద్రబాబు కాదా? ఆనాడు కమిటీ వేయమంటే వినలేదు. కొందరు కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుని ఇష్టం వచ్చిన రేట్లకు సినిమాలు ప్రదర్శించుకున్నారు. రూ.300, రూ.500, రూ.1000కి టికెట్లు అమ్ముకున్నారు. అయినా చంద్రబాబు కళ్లు మూసుకుని కూర్చున్నాడు. ప్రజలను దోచుకున్నా చూస్తూ కూర్చుండిపోయాడు. అందుకే గత ఎన్నికల్లో ఆయనను 23 సీట్లకు పరిమితం చేసిన ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
ఆ మాట మేము చెప్పలేదు
చంద్రబాబు కోసం పని చేస్తున్న కొందరు ఇవాళ పవన్‌కు శ్రేయోభిలాషులుగా మారారని, అందుకే జగన్ కు, పవన్ కళ్యాణ్ కు మధ్య ఒక యుద్ధం జరుగుతోందని, సీఎంగారు భీమ్లానాయక్ సినిమాను తొక్కేసారని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి 23న జీఓ ఇస్తామని, కాబట్టి సినిమా విడుదల చేసుకోమని మేము ఎప్పుడూ చెప్పలేదన్నారు.
అన్నీ తెలిసినా.. కావాలనే
ఈనెల 10న సినిమా పెద్దలు సీఎం జగన్ ను కలిసి కొన్ని సూచనలు చేశారని మంత్రి కొడాలి నాని గుర్తు చేస్తూ లాంటి వివాదాలకు తావు లేకుండా జీఓ ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే అనుకోకుండా మంత్రి గౌతమ్‌రెడ్ఢి హఠాత్తుగా మరణించడంతో, జీఓ రావడం ఆలస్యం అవుతోందన్నారు. ఈ విషయాలన్నీ పవన్‌కు తెలిసినా, రాజకీయాల కోసం అర్థాంతరంగా తేదీ ప్రకటించి, సినిమాను విడుదల చేసి, తన సినిమా కోసమే జీఓ ఆలస్యం చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ విధంగా చంద్రబాబు బాటలో నడవడం సిగ్గుచేటన్నారు. పవన్‌కు రెమ్యునరేషన్ అందింది.. నష్టపోతే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు.. ఆయనకు మాత్రం ఏం నష్టం లేదు.. అందుకే కావాలని 25న సినిమా విడుదల చేశారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.
నమ్ముకుంటే ముంచేస్తారు
చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్న కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ కు శ్రేయోభిలాషులుగా నటిస్తూ పవన్ కళ్యాణ్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. వారిస్తున్న సలహాలతో పవన్ కళ్యాణ్ ముందుకు పోతే, 2024లో కూడా చంద్రబాబు మిమ్మల్ని మోసం చేస్తారని, మీరు ఓడిపోయే 25 లేక 30 సీట్లు ఇస్తారు.. మీ వల్ల ఆయన బాగు పడే ప్రయత్నం చేస్తారు.. అంతేతప్ప, మీరు, మీ పార్టీ బాగుండాలని వారు కోరుకోరు. కాబట్టి ఇలాంటి వారిని నమ్మొద్దు అని సూచించారు.
చిరంజీవి సంస్కారవంతులు
చిరంజీవి తన ఇంట్లో పనివాళ్లు మొదలు పరిశ్రమలో అందరినీ గౌరవిస్తారని, చివరకు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వెళ్లినా లేచి రిసీవ్ చేసుకుంటారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరినీ గౌరవించే చిరంజీవి సినిమా పరిశ్రమ బాగుండేలా సహాయ, సహకారాలు అందించాలని సీఎం జగన్ ను కోరినట్లు చెబితే, కొన్ని మీడియాలలో చిరంజీవిని సీఎం జగన్ అవమానించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఇవాళ స్థాయికి, ఈ గుర్తింపునకు కారణం చిరంజీవి కాదా.. మరి ఆయనను కొన్ని మీడియాలలో అవమానం చేస్తుంటే, పరిస్థితి అర్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి తల్లి వంటి సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టకండని మంత్రి కొడాలి నాని కోరారు.
బ్లాక్‌లో టికెట్లకు నో
రాష్ట్రంలో ఎవరి సినిమా అయినా ఒకటే విధానం.. బ్లాక్‌లో టికెట్లు అమ్మడాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు.. ప్రజలను లూటీ చేయడాన్ని ఒప్పుకోం.. ఇక్కడ కొందరు బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోవడానికి అలవాటు పడ్డారు.. అది ఇక జరగకూడదని సీఎం జగన్ భావిస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్‌గారు ఒంటరిగా పోటీ చేస్తారని, ఆయన ప్రజలను నమ్ముకున్నారు. అందుకే ఎవరైనా పొత్తుకు వస్తామన్నా ఆయన ఒప్పుకోరని ఆయన పేర్కొన్నారు. జగన్ కు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ ఉంది.. కాబట్టి 2024లో కూడా సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఆయనో వింత మనిషి
సీపీఐ నారాయణపై మంత్రి కొడాలి నాని అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఒక వింత జీవి.. ఆయన తమది జాతీయ పార్టీ అని చెబుతారు.. ఆ జాతీయ పార్టీకి రెండే ఎంపీ సీట్లు ఉన్నాయని, మరో జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీకి 3 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి., మాకు 22 ఎంపీ సీట్లు, 6 రాజ్యసభ సీట్లు ఉన్నాయని చెప్పారు. వివేకానందరెడ్డి హత్యలో జగన్‌గారి కుటుంబానికి ప్రమేయం ఉందని నారాయణ ఆరోపించారు. సీపీఐ నారాయణ కానీ, చంద్రబాబు కానీ ఉక్రెయిన్ గురించి మాట్లాడరు.. ఎంతసేపూ జగన్‌గారి మీద విమర్శలు. సీఎంగారి మీద విషం కక్కడమే వారి పని.. ఇకనైనా ఇలాంటివి ఆపుకోవాలన్నారు.
ఇష్టమొచ్చినట్టు రేట్లు పెంచి.. దోచుకోనివ్వటం లేదని ఏకంగా తమ పార్టీ వారిని ఉసిగొల్పి ధియేటర్లలో కుర్చీలు, ఫర్నీచర్ విరగ్గొట్టించారు. బ్లాక్ టిక్కెట్లకు బహిరంగంగా వత్తాసు పలుకుతున్న ఈ రౌడీ మూకల్ని సమర్థిస్తారా..? లేక ప్రజలు తక్కువ రేట్లను సమర్థిస్తారా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ, చంద్రబాబు అనుకూల మీడియా ఉచ్చులో పడొద్దని పవన్ కళ్యాణ్ కు మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వల్ల మీకు, సినిమా పరిశ్రమకు ఎలాంటి సమస్యలు రావు, రాష్ట్రంలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలని, ప్రభుత్వానికీ ఆదాయం రావాలన్న తపన తప్ప, ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం సీఎం జగన్ కు లేదని వివరించారు.
ఇవి కూడా చదవండి
ఏపీ సర్కార్‌పై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు