ఇయ్యాల్టి నుంచే థియేటర్లు ఓపెన్.. సిటీలో సింగిల్​ స్క్రీన్​ థియేటర్స్​ క్లోజ్

ఇయ్యాల్టి నుంచే థియేటర్లు ఓపెన్.. సిటీలో సింగిల్​ స్క్రీన్​ థియేటర్స్​ క్లోజ్

గోడౌన్స్ లీజులకు ఇస్తున్న మేనేజ్ మెంట్లు

ప్రైవేట్ సంస్థలకు లీజులు ఇచ్చేయటానికే మొగ్గు
గోడౌన్స్ కోసం 6 థియేటర్స్ ను తీసుకున్న అమెజాన్
నేటి నుంచే సినిమా టాకీస్ లు రీ ఓపెన్

కరోనా ఎఫెక్ట్ తో బంద్ పడ్డ థియేటర్లు, మల్టీ ప్లెక్స్ లు ఇయ్యాల్టి నుంచే రీ ఓపెన్ అయితున్నయ్. రిలీజ్ కు రెడీగా తెలుగు సినిమాలు లేకపోయినప్పటికీ ఇతర లాంగ్వేజ్  సినిమాలతోనైనా స్టార్ట్ చేసేందుకు కొన్ని థియేటర్స్ అంతా సిద్ధం చేశాయి.  కొన్ని రోజుల పాటు  హిందీ, ఇంగ్లీష్ సహా  మల్టీపుల్ లాంగ్వేజ్ సినిమాలను నడిపించనున్నారు. ఏషియన్ సినిమాస్ సిటీలోని తమ 6 బ్రాంచ్ లలోని థియేటర్స్ ని శుక్రవారం రీ ఓపెన్ చేయనుంది. 50 శాతం ఆడియన్స్, కోవిడ్ గైడ్ లైన్స్ కి అనుగుణంగా తక్కువ స్టాఫ్ తోనే థియేటర్స్ షురూ చేస్తున్నారు.  మల్టీఫ్లెక్స్ ల్లో  పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్, సినీపోల్స్, ఏఎంబీ సినిమాస్‌లు కూడా స్టార్ట్ అవుతున్నయ్. 

హైదరాబాద్, వెలుగు:  సిటీలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇక ఫ్యూచర్ లో కనిపించడం కష్టమేనేమో.! లాక్ డౌన్ నాటి నుంచి మస్తు నష్టాల్లో ఉన్న ఈ థియేటర్స్ మేనేజ్ మెంట్ వీటిని రన్ చేసేందుకు ఆసక్తిగా లేరు. కరోనా మొదలైన తర్వాత తొలిసారిగా శుక్రవారం నుంచి థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్నా ఆ జోష్ ఎక్కడ కనిపిస్తలే. కరోనా గైడ్ లైన్స్ ప్రకారం 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం అనుమతులిచ్చింది. కానీ కొత్త సినిమాల్లేక, దాదాపు 8 నెలల నుంచి థియేటర్స్ బందే ఉన్నయ్. ఇప్పుడు స్టార్ట్ చేసినా భారమే తప్ప లాభం లేదని  మేనేజ్​మెంట్లు భావిస్తున్నయ్.  దీంతో వీటిని ప్రైవేట్ కంపెనీలకు, ఆర్గనైజేషన్లకు రెంట్ కు, లీజుకిస్తున్నారు. ఇప్పటికే సిటీలో తమకు గోడౌన్స్ కోసం అమెజాన్ 6 కు పైగా గెలాక్సీ థియేటర్ల ఓనర్లతో అగ్రిమెంట్ చేసుకుంది. మరికొంతమంది థియేటర్ల ఓనర్లు ఇలాగే గో డౌన్లు లేదా ఫంక్షన్ హాల్స్ గా మార్చే ఆలోచన చేస్తున్నరు.

లాక్ డౌన్ తో నష్టాల్లోకి..

చిన్న థియేటర్లు నడిపే వారు లాక్ డౌన్ తో లక్షల్లో నష్టపోయారు. బడా మల్టీప్లెక్స్ సంస్థలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను  లీజుకు తీసుకుని సినిమాలు నడిపించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నష్టాలే వస్తాయని భావిస్తున్నారు. సిటీలో దాదాపు  200 పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి.  వీటిలో కొన్ని గోడౌన్స్ గా మారగా, మరికొన్ని ఏదైనా కమర్షియల్ స్పేస్ కు లీజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లు రీ ఓపెన్ కి పర్మిషన్ ఉన్నప్పటికీ పడ్తల్ పడదని చాలా థియేటర్స్ మేనేజ్ మెంట్స్ చెబుతున్నాయి. ఇంత కష్టపడి వీటిని రన్ చేసే కన్నా క్లోజ్ చేయటమే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. వచ్చే 6 నెలల కాలంలో సిటీలో దాదాపు 100కు పైగా థియేటర్లు మూత పడే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన

లాక్​డౌన్​ టైమ్ లో సూపర్ మార్కెట్ల బిజినెస్ మంచిగా నడిచింది. దీంతో చాలా  సంస్థలు తమ బ్రాంచ్ లను పెంచాలని భావిస్తున్నాయి. గోడౌన్ స్పేస్ ల కోసం చూస్తున్న పెద్ద కంపెనీలూ ఉన్నాయి. ఇలాంటి సంస్థలకు ఇప్పుడే థియేటర్స్ ను అప్పగించేస్తే సేఫ్ గా ఉండవచ్చని మేనేజ్​మెంట్లు ఆలోచన చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే చాలా ప్రైవేట్ సంస్థలు క్లోజ్ చేసేందుకు థియేటర్స్ ఓనర్లతో బేరం మాట్లాడుతున్నాయి. ఇప్పటికే టోలిచౌకిలోని గెలాక్సీ థియేటర్, నారాయణ గూడలోని శాంతి థియేటర్, బహదూర్ పురాలోని శ్రీరామ థియేటర్, దిల్ షుక్ నగర్ లోని వెంకటాద్రి థియేటర్లను త్వరలోనే గోడౌన్స్ లేదా సూపర్ మార్కెట్లుగా మారుస్తారని సమాచారం.

మెయింటెనెన్స్ కూడా కష్టమే

లాక్ డౌన్ తో చిన్న థియేటర్లు మస్తు లాస్ అయినయ్. కిరాయి, మెయింటెనెన్స్ కూడా భరించే పరిస్థితి లేదు. అందుకే వేరే సంస్థలకు లీజుకు ఇస్తున్నరు. చాలా మంది థియేటర్స్ క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మేం ఇయ్యాల్టి నుంచి ఏఎంబీలో, ఉప్పల్, కొంపల్లి, అత్తాపూర్ లలోని మా స్క్రీన్స్ ని రీ ఓపెన్ చేస్తున్నం. ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి తర్వాత స్టెప్ తీసుకుంటం. ‑విశ్వనాథ్ రెడ్డి , ఏషియన్ మూవీస్ మేనేజర్