హైదరాబాద్, వెలుగు: బిగ్ స్క్రీన్ హంగామా సిటీలో షురూ అయింది. వంద శాతం ఆక్యుపెన్సీతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్సులు ఓపెన్ అయ్యాయి. పోయినవారం దాకా హైదరాబాద్‌లో నాలుగైదు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే ఓపెన్ కాగా శుక్రవారం మల్టీప్లెక్సులను కూడా ఓపెన్ చేశారు. దాదాపు 80 రోజుల తర్వాత ఓపెన్ కావడంతో ఐమాక్స్, దేవి, సుదర్శన్, ఐనాక్స్ ఇలా అన్ని థియేటర్లు ఆడియన్స్ తో కిటకిటలాడాయి. 70 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడిచాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఐనాక్స్ రీజినల్ డైరెక్టర్ మోహిత్ భార్గవ మాట్లాడుతూ తమ స్టాఫ్ అందరూ వాక్సిన్ వేయించుకున్నారని, డిస్టెన్స్ పాటిస్తున్నామని అన్నారు. సీటింగ్‌తో పాటు బాక్స్ ఆఫీస్, లాబీలు, ఆడిటోరియం, ఎగ్జిట్ గేట్లు అన్ని ప్రదేశాలను శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు.