తీన్మార్ మల్లన్న భావోద్వేగం..కేటీఆర్​ కామెంట్లపై మనస్తాపం

నల్గొండ, వెలుగు : ‘‘డబ్బులతో వచ్చే పదవి నాకొద్దు. అవసరమైతే ప్రజలకోసం ఇంకో గంట కష్టపడ్త” అని గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న అన్నారు. శనివారం నల్గొండ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్​ తన పైన చేసిన కామెంట్లకు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ‘‘ఒక బీసీ బిడ్డ తెల్ల అంగి వేసుకుంటే కేటీఆర్​ ఓర్వలేక పోతున్నడు. ఎన్నికల్లో పోటీ చేస్తే భరించలేకపోతున్నడు. బ్లాక్​ మెయిలర్​ అని నాపై కేటీఆర్​ ఆరోపణలు చేస్తున్నడు. నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చిన.

నేను బ్లాక్​ మెయిలర్​ ఎట్లవుత?  అసలు బ్లాక్​ మెయిలర్​  అనేటోడు ఈ రకంగా ఉంటడా? బీసీ బిడ్డ, బడుగు బలహీన వర్గాల బిడ్డ ఎన్నికల్లో పోటీ చేయొద్దా..?  కారులో తిరిగితే తప్పా?” అని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నా బిడ్డకు వచ్చిన కష్టం మరే బిడ్డకు రావొద్దని 200 ‌‌‌‌‌‌‌‌మంది ఆడ పిల్లలకు ఆపరేషన్​ చేయించిన. ఈ రకమైన విధానంతో నేను ముందుకు పోతున్న.

అయినప్పటికీ నాపైన ఆరోపణలు చేస్తుంటే.. రైట్​ టు రికాల్​ పెడ్తా అని చెప్పిన. నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజల కోసం పనిచేస్త. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్త. లేదంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్త” అని తీన్మార్​ మల్లన్న స్పష్టం చేశారు.