- ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్సీ బరిలో మల్లన్న
- బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డికి రెండోసారి పరీక్ష
- బీఆర్ఎస్ భవితవ్యం రాకేశ్‍రెడ్డి చేతిలో..
- అభ్యర్థి పేరు తప్పితే.. పార్టీ సింబల్ లేని ఎలక్షన్
- ఆలోచనాలపరుల మొగ్గు ఎటువైపో!
వరంగల్, వెలుగు: వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థుల నడుమ బిగ్‌ఫైట్ నెలకొన్నది. గత రెండు ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‍ఎస్ పార్టీలు మరోసారి రంగంలోకి దిగాయి. ఎన్నో వడబోతల అనంతరం ఏరికోరి అధికార కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకు, బీజేపీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి, సిట్టింగ్ ఎమ్మెల్సీగా బీఆర్‍ఎస్ పార్టీ ఏనుగుల రాకేశ్‍రెడ్డికి టికెట్లు కేటాయించాయి. అభ్యర్థులు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు దీటుగా12 జిల్లాల పరిధిలో జోరుగా ప్రచారం నిర్వహించారు.
నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మిగతా ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ బ్యాలెట్ పద్ధతిలో ఉంటుంది. పార్టీల సింబల్స్‌తో సంబంధం లేకుండా కేవలం అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉండనున్నాయి. గ్రాడ్యుయేట్లు, ఆలోచనపరులు కావడంతో క్యాండిడేట్ల బలబలాలు, మంచిచెడులను చూసి ఓటు వేసే అవకాశముంది. అదే టైంలో పార్టీల తీరుతెన్నులపైనా పట్టభద్రులు తీర్పు ఇస్తారని భావించవచ్చు.
కాంగ్రెస్ వేవ్‍లో..మల్లన్నకు చాన్స్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేవ్ నడుస్తున్న క్రమంలో అధికార పార్టీ ఈ ఎన్నికల్లో తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును అందరికంటే ముందు కన్‍ఫర్మ్ చేసింది. మల్లన్న 2015లో ఇదే వరంగల్– నల్గొండ– ఖమ్మం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా ఆపై పార్టీకి దూరమయ్యారు. 2019 హుజుర్‍నగర్ బై ఎలక్షన్‍తో పాటు 2021లో ఇదే స్థానం నుంచి ఇండిపెండెంట్‍గా ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. అప్పటి కేసీఆర్ సర్కార్ పాలన వైఫల్యాలను ఎత్తిచూపిన తీన్మార్ మల్లన్నపై అధికారపార్టీ కక్షగట్టింది. ఈక్రమంలో ఆయనపై దాడులు, కేసులు తీవ్రమయ్యాయి. పలు కేసుల్లో మల్లన్న జైళ్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు 2021 డిసెంబర్ 7న బీజేపీ రాష్ట్ర ఇన్‍చార్జి తరుణ్‍చుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ క్రమంలో ఎందరినో కాదని, మరెందరినో
సముదాయించి పార్టీ పెద్దలు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లన్న తరఫున జోరుగా ప్రచారం చేశారు. మొత్తంమీద మల్లన్న ముచ్చటగా మూడోసారి వరంగల్– నల్గొండ– ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో ఆయన గెలుపుపై కాంగ్రెస్పూర్తి విశ్వాసంతో ఉంది.
గుజ్జులకు సవాల్
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ హవా నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డికి ఈ గెలుపు బిగ్ టాస్క్ కానుంది. గుజ్జుల గతంలోనూ ఇదే ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేశారు. అప్పుడు దాదాపు 40 వేల ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. రాష్ట్ర బీజేపీలో అప్పుడు బండి సంజయ్, ఇప్పుడు కిషన్‍రెడ్డి అధ్యక్షులుగా ఉండగా..రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డినే ఉన్నారు. రాజకీయాల్లోనూ తీన్మార్ మల్లన్న, రాకేశ్‍రెడ్డి కంటే గుజ్జుల సీనియర్. ఈ ఇద్దరు సైతం రాష్ట్ర కమిటీలో గుజ్జుల టీంలో పనిచేసినవారే. ఈ క్రమంలో ఈసారి ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం ఆ పార్టీలో సీనియర్లుగా ప్రకాశ్‍రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పేర్లు వినిపించినా..మరోసారి ప్రేమేందర్‍రెడ్డికే అవకాశం వచ్చింది. పార్టీలో పెద్ద హోదాలో ఉంటున్న గుజ్జుల భవిష్యత్‌కు.. ఈ ప్రత్యక్ష ఎన్నిక సవాల్‍గా మారింది.
బీఆర్ఎస్ పరువు నిలిచేనా?
ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్‍ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్‍రెడ్డి రెండుసార్లు విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రస్తుతం ఉప ఎన్నిక అనివార్యమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్సీ స్థానం విస్తరించి ఉన్న నల్గొండ– ఖమ్మం– వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ చావు దెబ్బతిన్నది. ఇలాంటి టైంలో ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం ద్వారా పోయిన పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ హైకమాండ్ ఉంది.
ఈ క్రమంలో మూడు జిల్లాల పరిధిలో పలువురు ఉద్యమకారులు, లీడర్లు గులాబీ టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ అందరినీ కాదని..అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీ నుంచి కారు పార్టీలో చేరిన ఏనుగుల రాకేశ్‍రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మూడు జిల్లాల పరిధిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది.
దీనికితోడు ప్రధాన పార్టీల లీడర్లు అయిన మల్లన్న, ప్రేమేందర్‍రెడ్డిలకు గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న రాకేశ్‍రెడ్డి గెలుపు బీఆర్ఎస్కు ఊపిరిపోస్తుందనడంలో సందేహం లేదు.. అదే సమయంలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన రాకేశ్‍రెడ్డికి ఇది చావో, రేవో అని చెప్పక తప్పదు.