సీఎం కేసీఆర్ కు, మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కులగొట్టడం మాత్రమే తెలుసన్నారు తీన్మార్ మల్లన్న. పర్మిషన్ ఇవ్వలేదని స్టేజ్ ని తీసేసినా.. ప్రజల మనసుల్లోంచి మాత్రం ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ను ఎవరూ తీయలేరని చెప్పారు. నవంబర్ 30వ తేదీ కోసం రాష్ట్ర ప్రజలందరూ బీఆర్ఎస్ ను ఓడించడం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గతంలో కట్టిన ప్రాజెక్ట్ లు చెక్కు చెదరలేదని, బీఆర్ఎస్ హయంలో కట్టిన ప్రాజెక్టులు మాత్రం కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలోని వివేకానంద చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో తీన్మార్ మల్లన్నతో పాటు గడ్డం వంశీ కూడా పాల్గొని మాట్లాడారు. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ధర్మపురి గోదావరి నదిలో అస్తికలు కలుపుతామన్నారు తీన్మార్ మల్లన్న. ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కోసం పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ తిన్నది అంతా కక్కిస్తామన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే... తన బిడ్డ కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పారు. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వైన్స్ టెండర్లు సక్సెస్ అయ్యాయి గానీ.. పేపర్ లీకేజీ సక్సెస్ కాలేదన్నారు. కరోనా కంటే కేసీఆర్ డేంజర్ అన్నారు.
మంత్రి మలారెడ్డికి పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ కూడా తెలియదన్నారు తీన్మార్ మల్లన్న. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగితే కేసీఆర్ వెళ్లలేదని, మంత్రులు, ఎమ్మెల్యేల తల్లిదండ్రులు చనిపోతే మాత్రం హెలికాఫ్టర్ లో వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని అన్నారు. కేసీఆర్ ను చర్లపల్లి జైలులో పెట్టే వరకు తాను పోరాడుతూనే ఉంటానన్నారు. కొప్పుల ఈశ్వర్ కు ఓట్లు వేస్తే గొంతు నులిమి చంపేస్తాడని చెప్పారు. అడ్లూరి లక్ష్మణ్ గెలిస్తే తాను 100 కొబ్బరికాయలు కొడుతానని అన్నారు.