ఎమ్మెల్సీగా తీన్మార్​​ మల్లన్న

  • నల్గొండ-–ఖమ్మం-–వరంగల్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం
  • సిట్టింగ్ ​సీటును కోల్పోయిన బీఆర్ఎస్​
  • మూడు రోజులు కొనసాగిన కౌంటింగ్

నల్గొండ, వెలుగు: నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఎలిమినేషన్​ ప్రాసెస్​లో విజయానికి కావాల్సిన ఓట్లు రాకపోవడంతో టెక్నికల్​గా ఎక్కువ ఓట్లు వచ్చిన మల్లన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అధికారులు ప్రకటించారు. 52 మంది బరిలో నిలిచిన ఈ ఎన్నికలో కాంగ్రెస్​, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ సాగింది. మొత్తం 3 లక్షల 36 వేల 31 ఓట్లు పోలవగా, 3 లక్షల 10 వేల 189 ఓట్లు చెల్లాయి. ఏకంగా 25,824  ఓట్లు చెల్లకుండా పోయాయి. 

చెల్లుబాటైన ఓట్లలో విజేతకు 50 శాతం +1.. అంటే లక్షా 55 వేల 095  ఓట్లు రావాల్సి ఉంది. కానీ ఫస్ట్ ప్రయార్టీలో ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రయార్టీ ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి పొద్దు పోయే సమయానికి 48వ అభ్యర్థి వరకు ఎలిమినేషన్ పూర్తి చేశారు. ఇందులో మల్లన్నకు లక్షా 24 వేల 899 ఓట్లు రాగా, బీఆర్ఎస్​అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి లక్షా 5 వేల 524 ఓట్లు, బీజేపీ గుజ్జల ప్రేమేందర్​ రెడ్డికి 43,956 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్​ కుమార్​కు 30,461 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటా చేరుకోవాలంటే మల్లన్నకు మరో 30,196 ఓట్లు అవసరం. అయితే ఎలిమినేషన్​లో భాగంగా అశోక్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి ఓట్లు లెక్కించినా గెలుపు కోటా చేరుకోవడం సులువు కాదని అధికారులు మల్లన్నను విజేతగా ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకున్నారు.

కౌంటింగ్ లేటుపై అధికారులు సీరియస్

మూడు రోజుల్లో కౌంటింగ్ పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు పక్కాగా ప్లాన్​చేశారు. రౌండ్​కు 96 వేల ఓట్లు లెక్కింపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు వేగంగానే జరిగింది. కానీ రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేందుకు ఏకంగా 12 గంటల టైం పట్టింది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తికాగానే రిలీవర్స్ ఆలస్యంగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. దీంతో మొదటి రౌండ్ కంప్లీట్ చేసిన సిబ్బంది తమ పని అయిపోందని కౌంటింగ్ హాల్​లో ఖాళీగా కూర్చుండిపోయారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు కౌంటింగ్​ను తేలిగ్గా తీసుకోవడంపై ఎన్నికల పరిశీలకులు సీరియస్ అయ్యారు. ఈ ఎఫెక్ట్ మూడో, నాలుగో రౌండ్ల మీద పడింది.

ఎలిమినేషన్ స్పీడప్ చేసిన అధికారులు

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి ఒకటిన్నర రోజు పట్టింది. ఇక ప్రేమేందర్ రెడ్డి, అశోక్ కుమార్​ను ఎలిమినేట్ చేయగా వచ్చిన ఓట్లను మల్లన్నకు, రాకేశ్ రెడ్డికి షేర్ చేయాలంటే శుక్రవారం అర్ధరాత్రి తర్వాతగానీ ఫలితం వచ్చేలా లేదు. దీంతో ఎన్నికల పరిశీలకులు గురువారం మధ్యాహ్నం నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ స్పీడప్ చేయడానికి కౌంటింగ్ హాల్స్ పెంచారు. ప్రేమేందర్ రెడ్డి, అశోక్ కుమార్ ఎలిమినేట్ చేసినా కోటా పూర్తి కాదనే నిర్దారణకు వచ్చిన ఆఫీసర్లు టెక్నికల్​గా ఎక్కువ ఓట్లు వచ్చిన మల్లన్నను ఎమ్మెల్సీగా ప్రకటించారు.

కాంగ్రెస్ ఖాతాలో గ్రాడ్యుయేట్ సీటు

నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ తొలిసారిగా గెలుచుకున్నది. 2015లో కాంగ్రెస్ మద్దతుతో ఫస్ట్​టైమ్ పోటీ చేసిన మల్లన్నకు చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. మళ్లీ 2021లో రాముల నాయక్​ పోటీ చేసినప్పడు 27, 588 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ బైపోల్​లో సిట్టింగ్​ స్థానాన్ని కాపాడుకునేందుకు కేటీఆర్, హరీశ్ రావు, పల్లా గట్టిగానే ఫైట్ చేశారు మల్లన్న మీద సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. కానీ గ్రాడ్యుయేట్లు మాత్రం అంతిమంగా మల్లన్న వైపే మొగ్గు చూపారు.

బీజేపీకి స్వల్పంగా పెరిగిన ఓట్లు

గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేశారు. 2021లో పోటీ చేసినప్పుడు పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని.. మళ్లీ ఉప ఎన్నికల్లోనూ ఆయన్నే దించడంతో చాలా మంది పార్టీ నేతలకు నచ్చలేదు. 2021లో బీజేపీకి 39,107 ఓట్లు రాగా, ప్రస్తుత బైపోల్​లో 43,956 వచ్చాయి. అప్పటితో పోలిస్తే 4,849 ఓట్లు మాత్రమే పెరిగాయి.

ఇది సమిష్టి విజయం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

నల్గొండ, వెలుగు: నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తన విజయం.. కాంగ్రెస్ నాయకుల అందరి సమిష్టి విజయమని ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల నుంచి కష్టపడి పట్టభద్రుల మనసుల్లో చోటు సంపాదించుకున్నామని చెప్పారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం నూరు శాతం పట్టభద్రుల విజయం అన్నారు. తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, గెలుపు కోసం సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు, తన టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా ప్రజలకు జవాబుదారిగా పని చేస్తానని తెలిపారు. ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా.. పదవికి వన్నె తెచ్చే విధంగా పని చేస్తా అన్నారు.

సాంకేతితకంగా ఓడినా..  నైతికంగా నేనే గెలిచిన: ఏనుగుల రాకేశ్ రెడ్డి

సాంకేతికంగా ఓడినా.. నైతికంగా మాత్రం తానే గెలిచానని బీఆర్​ఎస్ అభ్యర్థి రాకేశ్​రెడ్డి అన్నారు. ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు మంత్రులతో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా తను గట్టిపోటీ ఇచ్చానని చెప్పారు. తన పోరాటం ప్రజల కోసమేనని.. ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని అన్నారు. పార్టీలకు అతీతంగా చాలా మంది తనకు మద్దతు తెలిపారని.. వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. పోటీ చేసే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు.

48వ రౌండ్ పూర్తి అయ్యేసరికి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు

తీన్మార్ మల్లన్న     1,24,899
ఏనుగుల రాకేశ్ రెడ్డి    1,05,524
గుజ్జల ప్రేమేందర్ రెడ్డి    43,956
పాలకూరి అశోక్ కుమార్​    30,461