తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్నకూతురు సౌందర్య ఇంట్లో చోరీ జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈమేరకు సౌందర్య తన ఎస్‌యూవీ కారుకు సంబంధించిన కీ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు అయింది. ఈ సందర్భాంగా సౌందర్య.. ఓ ప్రైవేట్ కాలేజీలో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేలోగా తన ఎస్‌యూవీ కారు కీ కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొంది.
ఇక కొద్దిరోజుల క్రితం రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో కూడా చోరీ జరిగింది. చెన్నైలో తన ఇంట్లో ఉన్న బంగారు, వజ్రాభరణాలు చోరీకు గురైనట్లు గుర్తించిన ఆమె తెయనాంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో 60 సవర్ల బంగారం, విలువైన వజ్రాభరణాలు ఉన్నాయని, అవి కనిపించడంలేదని వాటి విలువ సుమారు 3.60 లక్షల రూపాయల వరకు ఉంటుందని, 2019లో జరిగిన తన సోదరి సౌందర్య వివాహ వేడుకలో ఆ ఆభరణాలు ధరించినట్టు పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట చర్చనీయాంశంగా మారింది.