ముస్తాబాద్ వెలుగు: ఒకేరోజు పలుచోట్ల దొంగతనాలు జరిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని చికోడు గ్రామంలో జరిగింది. స్థానిక గౌడ సంఘం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం... చీకోడు గ్రామంలోని స్థానిక ఎల్లమ్మ గుడిలో మంగళవారం రాత్రి దొంగలు గుడి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. గుడిలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు దొంగిలించారు.
అనంతరం దగ్గర్లోని కల్లు మండువాల్లోని కల్లు లొట్లని ( కల్లు కుండలు) పగలగొట్టారు. పగిలిపోయిన కల్లు లొట్ల ఖరీదు దాదాపుగా 40 వేల రూపాయల వరకు ఉంటాయని గౌడ సంఘం నాయకులు తెలిపారు. సమీపంలో ఉన్న పొలాల్లో పండించిన పది కిలోల పచ్చి మిరపకాయలను కూడా దొంగలు కోసుకెళ్లారు. వాటితో పాటు దగ్గరలోని గొర్రెల మందలో నుంచి ఆరు గొర్లని ఎత్తుకెళ్లారు. కాగా, ఎల్లమ గుడిలో దొంగతనం చేసిన దొంగలు.. ఆలయ సమీపంలోని గోడలపై ‘ఇది ఆరంభం మాత్రమే’ అంటూ రాసి వెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.