- 75 గ్రాముల బంగారం, రూ.1.4 లక్షల చోరీ
హనుమకొండ, వెలుగు: అప్పులు తీర్చేందుకు అన్న ఇంట్లోనే చోరీకి పాల్పడిన తమ్ముడిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.1.4 లక్షల నగదు, 75 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ కరుణాకర్ మంగళవారం వెల్లడించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురానికి చెందిన మండల రవి కూలి పనులు చేస్తూ.. మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇటీవల అదే గ్రామంలో రవి అన్న సుధాకర్ కొడుకు పెండ్లి జరిగింది. పని లేకపోవడం, అప్పులోళ్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో సుధాకర్ ఇంట్లో దొంగతనం చేసేందుకు రవి ప్లాన్ చేశాడు.
ఈ నెల 26న సాయంత్రం సుధాకర్ కుటుంబసభ్యులంతా వేములవాడకు వెళ్లడాన్ని గమనించి ఇంట్లో దూరాడు. బీరువా తాళాలు పగలగొట్టి అందులోని గోల్డ్, డబ్బు చోరీ చేశాడు. నెక్కొండ సీఐ హతీరాం విచారణ చేపట్టి నిందితుడిని గుర్తించారు. మంగళవారం రవి చోరీ చేసిన సొమ్ము ను తీసుకునేందుకు ఇంటికి వచ్చినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న నర్సంపేట ఏసీపీ సంపత్ రావు, నెక్కొండ సీఐ హతీరాం, చెన్నారావుపేట ఎస్సై మహేందర్ తోపాటు కానిస్టేబుల్ కత్తి సురేశ్, ఇతర సిబ్బందిని ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్ అభినందించారు.