పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు 9 దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ లోని 3 కిరాణా షాపులు, దొడ్ల డైరీ, మందుల షాపు, బట్టల దుకాణం, మొబైల్ షాపు, కొంత దూరంలోని రెండు మొబైల్ షాపుల షటర్లను పగలగొట్టి చోరీ చేశారు.
అక్షర మొబైల్స్‌లో రెండు సెల్ ఫోన్లు, 1 ట్యాబ్, గాయత్రి మొబైల్స్‌లో 1 ట్యాబ్, దొడ్ల డైరీలో రూ.6 వేలు, శ్యామ్ కిరాణంలో రూ.4 వేలు, మేఘన జనరల్ స్టోర్, లేడీస్ కార్నర్లో రూ.45 వేలు దొంగతనం జరిగినట్లు బాధితులు తెలిపారు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, కొత్తకోట సీఐ రాంబాబు, ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి, క్లూస్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గుడిలో చోరీ!
గద్వాల: బ్రహ్మంగారి గుడిలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మల్దకల్ మండల కేంద్రంలోని బ్రహ్మంగారి గుడిలో శనివారం గద్వాలకు చెందిన ఓ జంట లవ్ మ్యారేజ్ జరిగింది. అదే రోజు బ్రహ్మంగారి గుడిలో దేవుడికి ఉన్న నాలుగు కిలోల వెండి, రెండు తులాల గోల్డ్ చోరీకి గురైంది.
ఈ విషయాన్ని భక్తులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులు సీక్రెట్ గా ఉంచుతున్నారని బ్రహ్మంగారి గుడి భక్తులు ఆరోపిస్తున్నారు. గుడిలో ఉండే వారే చోరీ చేశారని, తమను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. గద్వాల పట్టణానికి చెందిన జ్యువెలరీ వర్క్ చేసే వ్యక్తి గుడిలో సీక్రెట్ గా లవ్ మ్యారేజ్ చేశారని, అదే రోజు గుడిలో దొంగతనం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై మల్దకల్ ఎస్ఐన వివరణ కోరగా, కంప్లైంట్ రాలేదని చెప్పారు.