పట్టపగలు చోరీ.. గంటలోనే ఛేదించిన పోలీసులు

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలంలో పట్టపగలు జరిగిన చోరీని పోలీసులు గంటలోనే ఛేదించారు. పోగొట్టుకున్న సొమ్మును  బాధితుడికి భద్రంగా అందజేసి శభాష్ అనిపించుకున్నారు. గంటలోనే దొంగతనం ఛేదించిన రాయికల్ పోలీసులను స్థానికులతోపాటు .. అన్ని వర్గాల ప్రజలు  ప్రశంసించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 


రాయికల్ మండలం కుమ్మరి పల్లె గ్రామానికి చెందిన ఉడత శ్రీనివాస్ అనే వ్యక్తి రాయికల్ మండల కేంద్రంలో మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇవాళ ఉదయం కిరాయి డబ్బులు కట్టడం కోసం లక్ష 30 వేల రూపాయలు తీసుకుని వస్తుండగా  మార్గం మధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాయికల్ ఎస్సై కిరణ్ కుమార్ వేగంగా స్పందించారు. కేసు నమోదు చేసుకుని  ఇద్దరు యువకుల సహాయంతో  బాధితుడు పోగొట్టుకున్న లక్ష 30 వేల రూపాయల నగదు రికవరీ చేశారు. రికవరీ చేసిన లక్షా 30వేల రూపాయల సొత్తును బాధితుడు  శ్రీనివాస్ కు అందజేశారు.