దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు గుళ్ల చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొరికిన కాడికి దోచుకుపోతున్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో అక్టోబర్ 16న తెల్లవారు జామున ఒకేసారి ఐదు ఇళ్ళల్లో చోరీలు జరగడం కలకలం రేపింది. తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్ళల్లో దొంగతనాలు చేశారు దొంగలు. గ్రామం నడిబొడ్డున ఐదు ఇళ్ళ తాళాలు పగలగొట్టి 12 తులాల బంగారం, 23 తులాల వెండి,50 వేల నగదు చోరీ చేశారు దుండగులు. చోరీలు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయం ఇళ్ళకు వచ్చి చూసే సరికి ఇంట్లో బీరువాలు పగులగొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడింది చూసి చోరీ జరిగినట్టు గుర్తించారు.
గ్రామంలో ఒక్కొక్కటిగా ఐదు ఇళ్ళల్లో చోరీలు జరిగిన విషయం బయటకు వచ్చింది. బాధితులంతా రోజువారీ కూళీలు, వ్యవసాయదారులు. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ఇళ్ళను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ఐదు ఇళ్ళల్లో చోరీలు జరగడం పై గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.