కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ చౌరస్తాలోని రామలింగేశ్వరాలయంలో దొంగలు చొరబడి బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అడ్డువచ్చిన వాచ్ మెన్ సత్తయ్యను ఇనుపరాడ్డు, కొడవలితో కొట్టి తమకు కావాల్సిన వస్తువులు దోచుకెళ్లారు. స్వామి వారికి చెందిన సుమారు కిలోన్నర నుంచి 2 కిలోల బరువైన వెండి ఆభరణాలతో పాటు నాలుగైదు తులాల బంగారం చోరీకి గురైనట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
దొంగల దాడిలో గాయపడిన సత్తయ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, హుండీలు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారన్నారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలోని అర్చకుని ఇంట్లోనూ చోరీ చేసినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఇనుప రాడ్డు, కొడవలి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిగిన ఘటనపై అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.