సంగారెడ్డి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని రైతుల పొలాల్లో మార్చి 25 శనివారం రాత్రి ఓ వ్యక్తి చోరికి పాల్పడ్డాడు. పొలాల్లోని బోరు మోటర్ వైర్లను దొంగలిస్తున్న క్రమంలో దొంగ పట్టుబడ్డాడు. రైతులు అతడిని పట్టుకొని చితకబాదారు. అయితే ఆదివారం తెల్లవారు జామున దెబ్బల తీవ్రతకు తట్టుకోలేక ఆ దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు.
దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన మల్లేశ్ (29)గా గుర్తించారు. మృతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.