- రోజువారీ సిబ్బంది ద్వారా బయటకు వచ్చిన 62 ఆన్సర్ బుక్‌లెట్స్
- ఇప్పటికే 11 మంది అరెస్ట్
- తెర వెనుక ఆఫీసర్ల హస్తం ఉందని ఆరోపణలు
- విచారణకు సహకరించని ఉద్యోగులు, కేసును నీరుగార్చే ప్రయత్నాలు
- గతంలో వెలుగు చూసిన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంలోనూ ఇదే తీరు
హనుమకొండ, వెలుగు:కాకతీయ యూనివర్సిటీలో కీలకమైన పరీక్షల విభాగం అక్రమాలకు అడ్డాగా మారింది. ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో తరచూ ఏదో ఒక భాగోతం వెలుగు చూస్తుండగా, తాజాగా డిగ్రీ ఆన్సర్ షీట్స్ మార్పిడి వ్యవహారం కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పటికే 11 మంది డెయిలీ వేజ్ సిబ్బందిని అరెస్ట్ చేసినప్పటికీ తెర వెనుక ఆఫీసర్ల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కారణంతోనే కొందరు ఆఫీసర్లు పోలీసుల విచారణకు సహకరించకుండా కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో బయటపడిన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంలోనూ ఇలాగే జరగగా, డిగ్రీ ఆన్సర్ షీట్ల మార్పిడి ఘటనలో అదే సీన్ రిపీట్ అవుతోంది. ఆన్సర్ షీట్ల మార్పిడి ఘటన వెలుగు చూసి పది రోజులు అవుతున్నా తెరవెనుక ఉన్న సూత్రధారులు, ఆన్సర్ షీట్లు తెప్పించుకున్న స్టూడెంట్లు ఎవరో తేల్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
రోజు వారీ సిబ్బందితో ఆన్సర్ షీట్లు బయటకు...
కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు స్టూడెంట్లను పాస్ చేయించే పేరుతో అక్రమ దందాకు తెరలేపారు. స్టూడెంట్లు ఎగ్జామ్ రాసిన తర్వాత వారి ఆన్సర్ బుక్‌లెట్స్ అన్నీ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌కు చేరుకుంటాయి. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తాము అనుకున్న స్టూడెంట్ల ఆన్సర్ షీట్లను గుట్టుగా బయటకు తీసుకొచ్చి ఇంటి వద్ద ఎగ్జామ్ రాయించి తిరిగి మళ్లీ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లోని బండిల్స్‌లో పెడుతున్నారు. ఇందుకు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. ఈ దందా కొన్నేళ్లుగా సాగుతుండగా ఇటీవల బయటపడింది.
పరీక్షల విభాగంలో పనిచేసే డెయిలీ వేజ్ సిబ్బంది మాదాసి సునీల్, గడ్డం రాణాప్రతాప్, నాసం శ్రీధర్ మే 23న కొన్ని ఆన్సర్ బుక్‌లెట్స్‌ను బయటకు తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చి బండిల్స్‌లో కలిపారు. వారం తర్వాత సీసీ పుటేజీని పరిశీలించిన ఆఫీసర్లు కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు 18 మంది సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ఇందులో సునీల్, రాణాప్రతాప్, శ్రీధర్‌తో పాటు బొచ్చు పృథ్వీరాజ్, బైరి రమేశ్, చాట్ల సందీప్, పవన్‌కుమార్, పొన్నాల నితీశ్, పొలెపాక శ్రీకాంత్, దేవరకొండ రాజేశ్, చీకటి రాకేశ్ అనే 11 మందిని అరెస్ట్ చేశారు. వీరి ద్వారా 62 ఆన్సర్ బుక్‌లెట్స్ బయటకు వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఉద్యోగులను తప్పించే ప్రయత్నం ?
ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో కీలకమైన వాల్యూయేషన్ క్యాంప్‌లోని డెయివేజ్ సిబ్బంది వచ్చి ఆన్సర్ షీట్లు బయటకు తీసుకురావడం, అది కూడా వారం వరకు బయటకు పొక్కకుండా ఉండడం పట్ల మొదటి నుంచీ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దందా కొన్నేళ్ల నుంచీ నడుస్తోందని, ఇందులో పరీక్షల విభాగంలోని కొందరు ఆఫీసర్ల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఉద్యోగులు ఎవరన్న విషయం బయటకు వస్తే ఈ అక్రమాలకు సంబంధించి మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇందుకు సహకరించాల్సిన వర్సిటీకి చెందిన కొందరు పెద్దాఫీసర్లు అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలున్నాయి. అసలు దొంగల పేర్లు బయట పడకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా ఎగ్జామినేషన్ బ్రాంచ్, ఉద్యోగులు, స్టూడెంట్లకు సంబంధించిన అదనపు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరినప్పటికీ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. బుక్ లెట్స్‌ను బయటకు తెప్పించుకున్న 62 మంది స్టూడెంట్లలో హనుమకొండలోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన స్టూడెంట్లే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
ఫేక్ సర్టిఫికెట్ల విషయంలోనూ సేమ్ సీన్
కాకతీయ యూనివర్సిటీ పేరున గతంలో 250 మందికి ఫేక్ సర్టిఫికెట్లు ఇష్యూ అయ్యాయి. ఇందులో కొందరు అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నకిలీ సర్టిఫికెట్లతోనే కొందరు విదేశాలకు వెళ్లి చదువుతుండగా, మరికొందరు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. సమాచారం అందుకున్న వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు 2021 డిసెంబర్‌లో ఈ భాగోతాన్ని బయటపెట్టారు.
ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా టాస్క్‌ఫోర్స్, కేయూ పోలీసులు 250 స్టూడెంట్ల పేర్ల లిస్ట్‌ను వర్సిటీ ఆఫీసర్లకు పంపించారు. ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందాలో కొందరు రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారన్న ప్రచారం జరగడం సంచలనం రేపింది. కానీ ఆఫీసర్లు లైట్ తీసుకోవడం వల్ల రోజులు గడిచే కొద్దీ ఆ విషయం మరుగున పడింది.
వర్సిటీ ఆఫీసర్లు విచారణకు సహకరించకపోవడం వల్లే ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం కొలిక్కి రాలేదన్న ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఆన్సర్ బుక్‌లెట్స్ దందా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.