- కరెంట్ పోల్స్ ఎక్కి అల్యూమినియం వైర్ల చోరీ
- నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్
- రూ.12.50 లక్షల నగదు, రెండు మినీ ట్రాక్కులు సీజ్
షాద్ నగర్, వెలుగు: ప్రైవేటు వెంచర్లలో అల్యూమినియం వైర్లను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన కట్ట శ్రీనివాస్ (37), దిలావర్ (23), పెద్ద తుప్పర గ్రామానికి చెందిన కాకునూరి శ్రీనివాస్(32), మహేశ్వరం మండలానికి చెందిన బానోత్ రాజు(35) కలిసి కొన్నిరోజులుగా వెంచర్లలోని కరెంట్ పోల్స్‌కు ఉన్న అల్యూమినియం వైర్లను ఎత్తుకెళ్తున్నారు.
గత నెల 20న ఫరూఖ్ నగర్ మండలం నాగులపల్లి శివారులోని వెంచర్లో చోరీ జరిగినట్లు బాధితుడు నడింపల్లి మాధవ వర్మ ఫిర్యాదు చేశాడు. దీంతో షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షాద్ నగర్ పట్టణంలో బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పట్టుకొని, విచారించినట్లు ఏసీపీ రంగస్వామి తెలిపారు. నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ముందుగా రెక్కీ.. ఆ తర్వాత చోరీ
ముఠా సభ్యుల్లో ఒకరైన కట్ట శ్రీనివాస్ తొలుత బైక్ పై వెళ్లి రెక్కీ చేస్తాడని, అనంతరం ఎవరూ లేని సమయంలో దిలావర్ పోల్స్ పైకి ఎక్కి వైర్లను కట్ చేసి చోరీ చేస్తారన్నారు. అనంతరం స్క్రాప్ దుకాణాల్లో వాటిని అమ్మేస్తారని చెప్పారు.
కట్ట శ్రీనివాస్, కాకునూరి శ్రీనివాస్ ఇద్దరు బంధువులని, వీరిపై సైబరాబాద్, రాచకొండ, మహబూబ్ నగర్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 17 కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితుల నుంచి రూ.12.50 లక్షల నగదు, రెండు మినీ ట్రాక్కులు, 4 సెల్ ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.