ఆర్టీసీ బస్సుల్లో చోరీలు.. మహిళా దొంగ అరెస్ట్.. రూ.15.50 లక్షల విలువైన నగలు స్వాధీనం

ఆర్టీసీ బస్సుల్లో చోరీలు.. మహిళా దొంగ అరెస్ట్.. రూ.15.50 లక్షల విలువైన నగలు స్వాధీనం

హనుమకొండ, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద రూ.15.50 లక్షల విలువైన 188 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ పీఎస్​లో గురువారం ఏసీపీ దేవేందర్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. వరంగల్‌ సిటీలోని శివనగర్‌ కు చెందిన కట్రోజు విజయ భర్త కార్పెంటర్‌. 

పని చేయగా వచ్చిన డబ్బులు అతడు మద్యానికి ఖర్చు చేస్తుండటంతో ఇంటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతుండగా.. ఈజీగా డబ్బులు సంపాదించాలని విజయ ప్లాన్ చేసింది.  బట్టల షాపుల్లో చీరలు దొంగిలించడంతో పాటు బస్సులు, రైళ్లు, ఆటోల్లో ఒంటరి ప్రయాణికులను టార్గెట్ గా చేసుకుని చోరీలు చేస్తుంది.  వివిధ ప్రాంతాల్లో 14 చోరీలు చేసి, పలుమార్లు జైలుకెళ్లి వచ్చింది. 

అయినా తీరు మార్చుకోలేదు. హనుమకొండ టైలర్​ స్ట్రీట్​ లో చోరీ సొత్తును అమ్మేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకుని విచారించగా చోరీలు చేసినట్టు ఒప్పుకుంది. నిందితురాలిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హనుమకొండ సీఐ  సతీశ్​, క్రైమ్ ఎస్ ఐ కిషోర్, అడ్మిన్ ఎస్ఐ అశోక్ కుమార్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.