దేవాలయాల్లో దొంగతనాలు.. 21 గుళ్లలో చోరీలు

   ధర్మపురి, వెలుగు :  ఆలయాలే టార్గెట్​గా జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్  జిల్లా దొంగల ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. జగిత్యాల డీఎస్పీ ఎన్.వెంకటస్వామి గురువారం వివరాలు వెల్లడించారు. హన్మకొండ సిటీలోని గోపాల్ పూర్ ఎల్లమ్మ కాలనీకి చెందిన పాశం ప్రణీత్  అలియాస్  చింటూ, అదే సిటీలోని జవహార్ కాలనీకి చెంది మహమ్మద్  ఉమర్  ఫరూక్  కలిసి దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో 21 గుళ్లలో చోరీలు చేశారు. 

అలాగే  ధర్మపురి టౌన్ లో రెండు ఇండ్లలోనూ దొంగతనం చేశారు. జగిత్యాలలోనూ రెండు బైక్ లు చోరీ చేశారు. నిందితులు గతంలో కరీంనగర్ తోపాటు ఉమ్మడి వరంగల్ లోని దుగ్గొండి వరంగల్, కాజీపేట, మట్వాడ, గీసుకొండ, ఇంతజార్ గంజ్, మరిపెడ, మహబూబాబాద్, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో10 గుళ్లలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారు. గురువారం ఉదయం రాయపట్నం గ్రామ శివారులోని పెట్రోల్  బంక్  వద్ద నిందితులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు బైకులు, రూ.9,900 నగదు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.