సికింద్రాబాద్, వెలుగు: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఇద్దరిని, మరో గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు వేర్వేరుగా అరెస్ట్ చేశారు. ఈ కేసుల వివరాలను రైల్వే అర్బన్ డీఎస్పీ జావేద్, సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్ కలిసి శుక్రవారం వివరాలను వెల్లడించారు.
తాగుడుకు బానిసలై దొంగతనాలు..
బీహార్ ముంగర్ జిల్లాకు చెందినఅన్షురాజ్(31), నీరజ్‌కుమార్(31), అమర్ జిత్ రోజువారీ కూలీలు. తాగుడుకు బానిసలైన వీరు తొలుత ఈజీమనీ కోసం చిన్నచిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించడానికి రైళ్లలో చోరీలకు ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ముగ్గురు కలిసి నాలుగు నెలల క్రితం సిటీకి వచ్చి సికింద్రాబాద్ మోండా మార్కెట్ప్రాంతంలోని బాబా క్లాసిక్లాడ్జీలో ఉంటున్నారు.
ముగ్గురు కలిసి ప్రతిరోజు రైలు టికెట్లు కొని జనరల్, సెకండ్ క్లాస్ బోగీల్లో ప్రయాణిస్తున్నారు. మిగతా ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో వారి నగలు, నగదు, ఇతర బ్యాగులు దొంగిలించి తరువాత స్టేషన్లో దిగిపోతున్నారు. ఆపై దొంగిలించిన సొత్తును విక్రయించి జల్సాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దొంగిలించిన నగలను ఓ గోల్డ్ షాపులో అన్షురాజ్, నీరజ్ కరిగించేందుకు ప్రయత్నిస్తుండగా, అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరాన్ని అంగీరించడంతో అరెస్ట్ చేశారు. వారి నుంచి 4.3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అమర్జిత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఒడిశా టు పూనే.. వయా హైదరాబాద్
ఒడిశా గంజామ్ జిల్లా బరంపూర్‌కు చెందిన కాలు ప్రధాన్(30) ఉపాధి కోసం పూనేకు వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కూలి పనుల వల్ల వచ్చే ఆదాయం సరిపోవడం లేదని గంజాయి విక్రయించాలని ప్లాన్ చేసుకున్నాడు.
ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, రైళ్లలో పూనేకు తరలించి అమ్ముతున్నాడు. బుధవారం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు వచ్చిన అతడిని పోలీసులు అనుమానం వచ్చి తనిఖీ చేయగా, 10 కిలోల గంజాయి పట్టుబడింది. దీంతో
నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.