- హోమ్ ఓటింగ్ కు అర్హత ఉన్నోళ్లు 54,730 మంది
- 48 గంటల్లో ఎన్నికల సభలు, సమావేశాలకు పర్మిషన్
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లోక్ సభ పరిధిలో ఇంట్లో నుంచి ఓటు వేసే అర్హత ఉన్నవాళ్లు 54,730 మంది ఉన్నట్లు గుర్తించామని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల లీడర్లు, ప్రజలు పాటించాల్సిన నిబంధనలపై శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు, శారీరక దివ్యాంగుల కోసం మే 3 నుంచి 6 వరకు హోం ఓటింగ్ నిర్వహిస్తామన్నారు.
అర్హత కలిగినవారు కలెక్టరేట్‌లో ఫామ్ 12 డీ తీసుకుని వివరాలు నమోదు చేసి ఇవ్వాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 17.92 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, పురుషుల కంటే 50 వేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. లోక్‌సభ పరిధిలో 2,194 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గత లోక్ సభ ఎన్నికల్లో 69.49 శాతం పోలింగ్ నమోదయిందని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.58 శాతం నమోదైందని, ఈ సారి ఇంకా పెరిగేలా దృష్టి సారించామన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ర్యాలీలు, సమావేశాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు.
సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో పర్మిషన్ ఇస్తామని చెప్పారు. సి -విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు ఎన్నికల ఉల్లంఘనలపై 68 ఫిర్యాదులొచ్చాయని, వాటిపై చర్యలకు ఆదేశించామన్నారు. ఇప్పటివరకు కరీంనగర్ లోక్ సభ పరిధిలో రూ.7 కోట్ల నగదును పట్టుకున్నామని వెల్లడించారు. ఒకే ఇంటి నంబర్ పై ఎక్కువ మంది ఓటర్లున్నట్లు గతంలో బీజేపీ ఫిర్యాదు చేసిందని, అయితే ఒకే నంబర్ తో వేర్వేరు గ్రామాల్లో ఉన్న ఇంటి నంబర్లను ఒక్క దగ్గరికి తెచ్చి అన్నీ కరీంనగర్ లో ఉన్నట్లు చూపారన్నారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు వాహనాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలను తరలించొద్దని, పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నట్లు ఫిర్యాదులున్నాయని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ తదితరులు పాల్గొన్నారు.