- ఉమ్మడి జిల్లాలోని ఆరు సెగ్మెంట్లలో అభ్యర్థులు డిక్లేరయ్యే ఛాన్స్
- జాబితాపై ఆశావహుల ఆరా
- ఎంపీ అర్వింద్ పోటీపై ఉత్కంఠ!
నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీకి పోటీ చేసే క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్‌ను బీజేపీ మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉండడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం తొమ్మిది సెగ్మెంట్లలో ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా మూడింటిపై హైకమాండ్ కసరత్తు కొనసాగిస్తోంది. మొదటి జాబితాలో ఎంపీ అర్వింద్ పేరు ఉంటుందా? ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
జాబితాలో వీరికి అవకాశం..
గెలుపు గుర్రాలను బరిలోకి దింపడానికి పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. బాల్కొండ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ పేరు ఫైనల్అయినట్లు తెలుస్తోంది. ఆమె కాదంటే ఆమె కొడుకు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి పోటీ చేయనున్నారు. అర్బన్ నుంచి 11 మంది టికెట్ రేసులో ఉండగా, ధన్పాల్ సూర్యనారాయణ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరో సీనియర్ నేత ఢిల్లీ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జుక్కల్ నుంచి మాజీ ఎమ్మెల్యే అరుణతార బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. బోధన్ నుంచి మేడపాటి ప్రకాశ్‌రెడ్డికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వడ్డీ మోహన్‌రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి సెగ్మెంట్ నుంచి ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన వెంకట రమణారెడ్డి బరిలో నిలువనున్నారు. నిజామాబాద్ రూరల్ టికెట్ కోసం ఆరుగురు అప్లికేషన్లు పెట్టిగా, దినేశ్ కులాచారి గానీ, ఆయన భార్య దివ్య గానీ పోటీ చేసే అవకాశం ఉంది. దివ్య గతంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు.
ఎల్లారెడ్డి, బాన్సువాడపై కసరత్తు..
మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఎల్లారెడ్డి నుంచి అంతకంటే బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక్కడ ఏడుగురు లీడర్లు టికెట్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉంది. బాన్సువాడ నుంఏచి 11 మంది అప్లై చేసుకున్నారు. వారిలో ఒకరి పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతను పంపాలన్న ప్రతిపాదనను కూడా పార్టీ పరిశీలిస్తోంది.
ఆర్మూర్‌పై సందిగ్ధం..
ఎనిమిది మంది నేతలు ఆర్మూర్ టికెట్ఆశిస్తున్నారు. పైడి రాకేశ్‌రెడ్డి, మహిళానేత ఆలూరు విజయభారతి పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ అర్వింద్ పోటీ చేసే విషయాన్ని తీసిపారేయలేని పరిస్థితి ఉంది. అర్వింద్ లేనిపక్షంలో పైడి రాకేశ్‌రెడ్డిని బరిలో నిలపాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.