కేబినెట్​లోచాన్స్​ ఎవరికో?

కేబినెట్​లోచాన్స్​ ఎవరికో?
  • రేసులో జూపల్లి, యెన్నం, చిక్కుడు వంశీకృష్ణ

మహబూబ్​నగర్, వెలుగు : తెలంగాణలో తొలిసారిగా అధికారాన్ని చేజింక్కించుకున్న కాంగ్రెస్​ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రిపేర్​ అవుతోంది. ఈ కేబినెట్​లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎవరికి చాన్స్​ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎంగా కొడంగల్​ ఎమ్మెల్యే, టీపీసీసీ చీఫ్  ఎనుముల రేవంత్​రెడ్డిని హైకమాండ్​ ఫైనల్ చేయనున్నట్లు వార్తలు వస్తుండగా, ఇంకా ఎవరెవరికి మంత్రి వర్గంలో చాన్స్​ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో మహబూబ్​నగర్​ నుంచి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి (వైఎస్ఆర్), కొల్లాపూర్​ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

జూపల్లికి అవకాశం దక్కుతుందా?

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కేబినెట్​లో చాన్స్​ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్​ ఎమ్మెల్యేల్లో  ఈయనే సీనియర్​ కావడం కలిసిరానుంది. జూపల్లి ఇప్పటి వరకు ఏడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, ఆరు సార్లు కొల్లాపూర్​ ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డ్​ సృష్టించారు. ఉమ్మడి ఏపీలో మొదట కాంగ్రెస్​ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్​ విజయాలు నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, నల్లారి కిరణ్​కుమార్ రెడ్డి​ కేబినెట్​లో సివిల్​ సప్లై, దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి, జూపల్లి ఉద్యమంలో పాల్గొన్నారు. 2011లో  కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసి 'ప్రజా అభియాన్​ యాత్ర' పేరిట ఉమ్మడి పాలమూరు జిల్లాలో 650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

ఆ తర్వాత 2012లో కేసీఆర్​ సమక్షంలో టీఆర్ఎస్​(ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరారు. అదే ఏడాది కొల్లాపూర్  అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్​ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొల్లాపూర్​ నుంచి గెలుపొందారు. అప్పటి సీఎం కేసీఆర్​ కేబినెట్​లో మొదటగా ఐటీ, మున్సిపల్​ శాఖ మంత్రిగా పని చేశారు.

ఏడాది తర్వాత పంచాయతీరాజ్​ శాఖ మంత్రిగా పని చేశారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా.. ఈ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్​ పార్టీలో చేరి గెలుపొందారు. సీనియర్​ లీడర్​ కావడం, ఇది వరకు వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించడం వల్ల ఆయనకే మంత్రి వర్గంలో చాన్స్​ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈక్వేషన్లు చెబుతున్నాయి. దీనికితోడు వెలమ సామాజికి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉండడం, వారంతా జూనియర్లు కావడంతో జూపల్లికి మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయి.

పరిశీలనలో వైఎస్ఆర్​ పేరు..

మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి పేరును కూడా హైకమాండ్​ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ జిల్లా నుంచి రేవంత్​రెడ్డి ఉండగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్​ నియోజకవర్గంలోకి కొన్ని మండలాలు వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి కోటాను వికారాబాద్​ జిల్లాకు కేటాయిస్తే గన్​షాట్​గా వైఎస్ఆర్​కు మంత్రి పదవి దక్కనుంది. దీనికితోడు మంత్రి శ్రీనివాస్​గౌడ్​ను ఓడించడం, ఉమ్మడి జిల్లాకు పాలమూరు హెడ్​క్వార్టర్​ కావడంతో ఈ ఈక్వేషన్​ ఆధారంగా కూడా ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కవచ్చని భావిస్తున్నారు. ఒక వేళ మంత్రి వర్గంలో చోటు దక్కకపోయినా ప్రభుత్వ విప్​ వంటి పదవి ఇచ్చే అవకాశం ఉంది.

లిస్టులో వంశీకృష్ణ..

అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు కూడా కేబినెట్​లో చాన్స్​ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈయన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో గువ్వల బాలరాజును ఓడించారు. అయితే ఈయన సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉండడం, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి కూడా మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలుండడంతో మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి. ఒక వేళ మంత్రి వర్గంలో చోటు రాకున్నా విప్​ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

సరితకు ఎమ్మెల్సీ?

జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్​ పార్టీకి అనుహ్య పరాభవం ఎదురైంది. గద్వాల, అలంపూర్  స్థానాల నుంచి సరిత, ఎస్ఏ సంపత్​కుమార్​ గెలుస్తారని హైకమాండ్​ నమ్మకం పెట్టుకుంది. కానీ, బీఆర్ఎస్, బీజేపీకి చెందిన  ఇద్దరు ‘కీ’ లీడర్లు తెరవెనుక కథ నడిపించడంతో ఈ రెండు స్థానాలను పార్టీ కోల్పోవాల్సి వచ్చింది.

అయితే జిల్లా మీద పట్టు తెచ్చుకునేందుకు ఇప్పటికే సంపత్​కుమార్​కు ఉన్నతమైన పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్న హైకమాండ్, సరితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేబినెట్​ ఏర్పాటు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.