- ఏజెన్సీ ఏరియాలో అత్యవసర సేవలకు అంతరాయం
- లో లెవల్ బ్రిడ్జిలతో ప్రజలకు తప్పని ఇబ్బందులు
- హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణాలతోనే సమస్యలు పరిష్కారం..
మహబూబాబాద్, వెలుగు: వర్షాకాలం వస్తుందంటే చాలు ఏజెన్సీ ఏరియా ప్రజలకు సరైన రవాణా సదుపాయంలేక అత్యవసర వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఏజెన్సీ పల్లెల వైపు ఉన్న ప్రజలు మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు చేరుకోవాలంటే సాహస యాత్ర చేయవలసి వస్తుంది. భారీ వాహనాలు సైతం అతి కష్టం మీద వాగులు దాటుతుంటాయి.
వరదల సమయంలో లో లెవల్ కాజ్ వేల వద్ద వాగులు దాటుతూ పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. మంత్రి సీతక్క స్పందిస్తేనే ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగరాం మండలాలతోపాటు జిల్లాలోని గూడురు, బయ్యారం, గార్ల, తొర్రూరు మండల పరిధిలో ప్రజల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
వాగులు దాటాలంటే సహసం చెయ్యాల్సిందే..
వానాకాలంలో కొత్తగూడ మండలం వేలుబెల్లి కత్తెర్లవాగు దాటేందుకు పలువురు ప్రయత్నించి కొట్టుకుపోయి మృతి చెందారు. రెండేండ్ల కింద పోలారానికి చెందిన ఓ వృద్ధురాలు పింఛన్ కోసం వస్తూ వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఏడాది కిందట గర్భిణిని ప్రసవానికి ట్రాక్టర్లో వాగు దాటించినా, శిశువు దక్కని పరిస్థితి నెలకొంది. కొత్తగూడ మండలంలోని ముస్మీ వాగు ప్రవాహం తీవ్రంగా ఉంటుంది. అత్యవసర సమయంలో ట్రాక్టర్ల ద్వారా వాగును దాటిస్తుంటారు. నాయకపల్లి, తీగలవేణిలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
నర్సంపేట - కొత్తగూడ ప్రధాన రహదారిపై..
నర్సంపేట, కొత్తగూడ ప్రధాన రహదారిపై గాంధీనగర్ వాగు ప్రవహించడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. పలుమార్లు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయిన సంఘటనలున్నాయి. వాగు ఉధృతి పెరిగితే గూడూరు మండలం భూపతిపేట, గుంజేడు మీదుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో ప్రయాణికులకు 10 కిలో మీటర్ల దూరం పెరుగుతుంది. కొత్తగూడ మండలం గాంధీనగర్ లోలెవల్ కాజ్ వేతో సమస్య గుర్తించిన మంత్రి సీతక్క ఈ వాగువంతెన నిర్మాణానికి రూ.1.50 కోట్లు కేటాయించారు. పనులు ప్రారంభం కావలసి ఉంది.
గూడూరు మండల కేంద్రం దగ్గర పాకాల వాగును రాత్రి వేళ దాటేందుకు ప్రయత్నించి ప్రమాదాలకు గురయ్యారు. వాగు ప్రవహించినప్పుడు బొల్లెపల్లి, అయోధ్యపురం, పొనుగోడు, గాజులగట్టు, మధనాపురం, గుండెంగ, రాములు తండా ప్రజలకు రవాణా ఇబ్బందులు తప్పడం లేదు.
బయ్యారం మండలం కిష్టాపురం, కోయగూడెం మధ్య ఉన్న పెద్ద వాగు కారణంగా ఆరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిష్టాపురం, మొట్లగూడెం, కాచనపల్లి, కోయగూడెం సుద్దరేవు, సుంచు బంధం తండా ప్రజలు వర్షాకాలంలో వ్యవసాయ పనులకు వెళ్లాలంటే 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాలి.
తొర్రూరు మండలం గుర్తూరు సమీపంలో ఈదుల వాగు పొంగిన క్రమంలో లో లెవల్ కాజ్ వే మూలంగా నర్సంపేట_ తొర్రూరుకు వాహనాల రవాణా నిలిచిపోతుంది.
గార్ల మండల కేంద్రంలో ఆకేరు వాగుపై చెక్ డ్యామ్ కమ్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హైలెవల్ బ్రిడ్జిలను నిర్మించాలి..
ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలంలో రవాణా కష్టాలను తీర్చడానికి మంత్రి సీతక్క స్పందించి హై లెవల్ బ్రిడ్జిలు నిర్మించేలా చూడాలి. ఫారెస్ట్ అనుమతుల సమస్యలతో పనులు నిలిచిపోయిన చోట వెంటనే సమస్యను పరిష్కరించి, ఏజెన్సీ ఏరియా ప్రజల కష్టాలను తీర్చాలి.
- వెంకట్ నారాయణ చారి, వేలుబెల్లి గ్రామం