- ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులు
- నాలుగేండ్లుగా పెరిగిన అవినీతి, అక్రమాలు
- ఇసుక, నల్ల మట్టి దందాలతో వేల కోట్ల అక్రమ సంపాదన
- విసిగెత్తి మార్పు కోసం ఓటుతో బుద్ధి చెప్పిన ఓటర్లు
మహబూబ్‌నగర్, వెలుగు : పదేండ్లుగా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న పాలమూరులో ‘కారు’ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. 13 స్థానాల నుంచి ఈ ఎన్నికల్లో ఏకంగా రెండు స్థానాలకే పరిమితమైంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ స్థానాల్లో హస్తం హవా కొనసాగింది. అయితే, ఆ పార్టీ లీడర్ల అహంకార ధోరణి ఎన్నికల్లో కొంపముంచిందనే టాక్ నడుస్తోంది.
ఓట్లు వేసి గెలిపించిన ప్రజల పట్లే దురుసుగా ప్రవర్తించడం, వారి ఆస్తులను కబ్జా చేయడం, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు ఇలా రకరకాలుగా వేధించడం వల్లే ఓటర్లు విసిగి వేసారి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేశారనే వార్తలొస్తున్నాయి.
భూములు, ప్లాట్ల ఆక్రమణలు..
బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల, మహబూబ్‌నగర్, మక్తల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, దేవరకద్ర, అలంపూర్ నియోజరవర్గాల్లో అవినీతి అక్రమాలు తారా స్థాయికి చేరాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాల్లో భూ ఆక్రమణలు పెరిగిపోయాయి. ‘ధరణి’ పోర్టల్‌లోని లొసుగులను ఆధారం చేసుకొని కొందరు లీడర్లు ప్రభత్వ, ప్రైవేట్ భూములను వేల ఎకరాల్లో కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
రెవెన్యూ డిపార్ట్మెంట్లోని కొందరు ఆఫీసర్లను ఇందులో ఇన్వాల్వ్ చేసి కబ్జా చేసిన భూముల రికార్డులను తారుమారు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 వేల ఎకరాల భూములను సంపాదించారనే ఆరోపణలున్నాయి. ఓ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బంధువు ఒకరు, వారంలో రెండు సార్లు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. ఇవి కాకుండా హైవేలు, బైపాస్‌ల పొంటి ఉన్న ప్రైవేట్ భూములను కూడా చెరబట్టారనే టాక్ ఉంది.
సదరు భూ యజమానులు ఆ భూములను వీరికి తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయకుంటే బెదిరింపులకు దిగడం, దౌర్జన్యాలు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవికాకుండా జిల్లా కేంద్రాలు, మున్సిపాల్టీల్లో పేదలు కొన్న ప్లాట్లను కబ్జా చేయడం వంటి ఘటనలు బయటకు వచ్చాయి. ఒక్కో ప్లాట్‌ను డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు చేసి పేదల సొమ్మును దోచుకున్నారనే ఆరోపణలున్నాయి.
బాధితులు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీస్స్టేషన్లకు వెళ్లి కంప్లైంట్ చేస్తే, లీడర్లు బాధితులపైనే కేసులు పెట్టించి అక్రమంగా అరెస్టులు చేయడం వంటి ఘటనలు నాలుగేళ్లుగా పెరిగిపోయాయి. దీంతో ప్రజల్లో అధికార పార్టీ లీడర్ల పట్ల తీవ్రమైన అసంతృప్తి, వ్యక్తిరేకత ఏర్పడింది.
అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలు లీడర్ల వద్దకు సమస్య చెప్పుకోవడానికి వెళితే, అహంకార ధోరణితో మాట్లాడిన ఘటనలున్నాయి. సభలు, సమావేశాల్లో సమస్యలపై ప్రశ్నిస్తే వారి పేర్లు, అడ్రస్ నోట్ చేసుకొని దాడులు చేయడం, బూతులు తిట్టడం, లేదంటే పోలీసులతో భయపెట్టించారు. దీనికితోడు సెకండ్ క్యాడర్ లీడర్లను తయారు చేయకపోవడం, ఉన్న వారికి అణచి వేయడం, వారిని ప్రజల ముందే బూతులు తిట్టడం వంటివి ఇబ్బందికరంగా మారాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ వారే వెన్నుపోటు పొడిచారనే టాక్ నడుస్తోంది.
వేల కోట్ల అక్రమ సంపాదన..
ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి, మక్తల్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో తుంగభద్ర నది, దుందుభి, ఊకచెట్టువాగు, చెక్ డ్యామ్‌లు, ఫిల్టర్ ఇసుక తయారీ, ఎర్రమట్టి గుట్టలు.. ఎక్కడ పడితే అక్కడ ఇసుక అక్రమ రవాణా, పాలమూరు- రంగారెడ్డి స్కీమ్‌కు అక్రమంగా నల్ల మట్టి తరలింపు, డెవలప్మెంట్ పేరుతో చెరువుల్లో ఒండ్రు మట్టి తరలింపుతో వేల కోట్లు సంపాదించినట్లు ఆరోపణలున్నాయి. వీటిని అడ్డుకున్న యువకులు, రైతులపై దాడులు చేయడం, టిప్పర్లతో తొక్కించి చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఇవన్నీ గమనిస్తూ వచ్చిన ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు.