- టీచర్లు, హెల్పర్ల దగ్గర ఓ సంఘం లీడర్లు, అధికారుల వసూళ్లు
- ఏండ్లుగా పెండింగ్‌లోనే ఫైళ్లు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అర్హులైన హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని ఏడాది కిందట ప్రభుత్వం ఆర్డర్స్జారీ చేసింది. అలాగే టీచర్ల ట్రాన్స్ఫర్లు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. కానీ ఆ శాఖ అధికారులు, యూనియన్ల లీడర్లు తమకు అనుకూలంగా ఉన్నవారికి లబ్ధి చేసేందుకు ప్రయత్నిస్తూ ఈ ఫైళ్లను తొక్కిపెట్టారు. పాత జీఓ ప్రకారం ప్రమోషన్లు ఇప్పిస్తామని, స్పౌజ్ఆప్షన్లో ట్రాన్స్ఫర్లు చేయిస్తామని కొంతమంది దగ్గర రూ.లక్షకు పైగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
పాత జీఓ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలంటూ..
అంగన్వాడీ టీచర్ల రిక్రూట్మెంట్, ప్రమోషన్లకు సంబంధించి గైడ్‌లైన్స్ పేర్కొంటూ సెంట్రల్‌గవర్నమెంట్ నిరుడు జనవరిలో సర్క్యులర్ జారీ చేసింది. ఇంటర్ క్వాలిఫికేషన్ఉన్నవారినే అంగన్వాడీ టీచర్లుగా నియమించాలని స్పష్టం చేసింది. ప్రమోషన్లకు తప్పనిసరిగా ఐదేండ్ల సర్వీస్ కలిగి ఉండి, 45 సంవత్సరాల లోపు వారే అర్హులని పేర్కొన్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మేలో మరో సర్క్యులర్‌ను జారీ చేసింది.
కానీ ప్రమోషన్ల విషయంలో కొంతమంది యూనియన్ లీడర్లు అంతకుముందున్న పాత జీఓను తెరపైకి తెచ్చారు. టెన్త్ క్వాలిఫికేషన్‌తోనే ప్రమోషన్లు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పాత జీఓ ప్రకారమే ప్రమోషన్లు ఇప్పిస్తామని కొంతమంది దగ్గర రూ.లక్షకు పైగా వసూళ్లు చేయడమే కాకుండా అందులో అధికారులకు సైతం వాటాలు ఉంటాయని చెప్పినట్టు సమాచారం.
మందమర్రి మండలానికి చెందిన ఓ హెల్పర్‌కు టెన్త్క్వాలిఫికేషన్తో ప్రమోషన్ఇప్పిస్తామని చెప్పి రూ.లక్ష వసూలు చేసినట్టు తెలిసింది. ప్రమోషన్ల ఫైళ్లను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంతో సహజంగానే అధికారుల తీరుపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా.. చెన్నూర్‌లో5, లక్సెట్టిపేటలో 5, మంచిర్యాలలో 7, బెల్లంపల్లిలో 1, మొత్తం 18 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.
రూల్స్‌కు విరుద్ధంగా ట్రాన్స్ఫర్లు
అంగన్వాడీ టీచర్ల బదిలీ విషయంలోనూ యూనియన్ లీడర్లు, అధికారులు కుమ్మక్కైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్‌లో గైడ్‌లైన్స్ జారీ చేయగా, వాటిని ఇప్పటివరకూ పెండింగ్ పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రూల్స్ ప్రకారం ప్రాజెక్టు పరిధిలోనే ట్రాన్స్ఫర్లు చేయాల్సి ఉన్నప్పటికీ పక్క ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు కూడా స్పౌస్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు.
మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలోని నస్పూర్మండలంలో పనిచేస్తున్న ఓ టీచర్ మంచిర్యాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. ఆమెను కాదని లక్సెట్టిపేట ప్రాజెక్టు పరిధిలోని పనిచేస్తున్న మరో టీచర్‌ను స్పౌజ్ కేటగిరీలో మంచిర్యాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రామకృష్ణాపూర్లో పనిచేస్తున్న ఓ టీచర్ రూల్స్ ప్రకారం బదిలీకి అర్హురాలు కాగా, ఆ స్థానంలో మందమర్రిలో పనిచేస్తున్న మరో టీచర్‌ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది.
కానీ అంగన్వాడీ టీచర్లకు స్పౌజ్ కేటగిరీ వర్తించదన్న విషయాన్ని పట్టించుకోకపోవడం విడ్డూరం. ఈ వ్యవహారంలో అధికారుల పేరు చెప్పి ఓ యూనియన్ లీడర్లు భారీగానే వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచిర్యాలలో 5, లక్సెట్టిపేటలో 2, చెన్నూర్‌లో 10, బెల్లంపల్లిలో 2 అప్లికేషన్లు వచ్చాయి. ఎట్టకేలకు అడిషనల్ కలెక్టర్ జోక్యంతో డీడబ్ల్యూఓ ఆఫీసులో పెండింగ్‌లో ఉన్న ఈ ఫైళ్లు కదులుతున్నట్టు తెలిసింది. అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు చేపట్టాలని, యూనియన్ లీడర్ల జోక్యాన్ని అరికట్టాలని కోరుతున్నారు.