రాష్ట్రంలో సంచార జాతులన్నింటినీ ఎంబీసీలుగా గుర్తించి వారి అభివృద్ధికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ ఘనంగా చెప్పారు. మూడేండ్ల క్రితం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. కనీసం ఎవరూ గుర్తించని జాతులకు ఏదో మేలు జరగబోతోందని అంతా ఆశపడ్డారు. కానీ మొదట్లోనే ఆశలను ప్రభుత్వం నీరుగార్చేసింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు ఆ వర్గాలతో సంబంధంలేని సామాజిక వర్గానికి చెందిన నేతలను చైర్మన్‌గా నియమించారు. పైగా బీసీ-బీ అయిన ఆ నేతను ఎంబీసీ అని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. మళ్లీ ఇటీవల మాజీ మంత్రి బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయనా బీసీనే. అయినా సీఎం కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఒక సమావేశంలో మాట్లాడుతూ సారయ్యను ఎంబీసీ అని చెప్పారు. ఇలా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలు ఎంబీసీలు కానివారిని కూడా ఆ వర్గాలకు చెందిన నేతలుగా చెప్పడం బాధాకరం. అంటే ఎంబీసీల్లో ఎవరెవరు ఉన్నారో కూడా సర్కారు పెద్దలకు తెలియదనుకోవాలా? లేక సంచార జాతుల్లో ఉండేవాళ్లు పదవులు పొందేందుకు అర్హులు కాదనా?
ఎన్నో ఏండ్లుగా ఒక గుర్తింపు అంటూ లేకుండా ఉండిపోయిన 35 సంచార జాతులను, అనాథలను కలిపి ఎంబీసీ కులాలుగా గుర్తిస్తూ 2018లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఆయా జాతుల్లో సంతోషాన్ని నింపింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎంబీసీలకు ఆర్థిక చేయూత అందించి, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. 2018 మార్చి చివరిలో తాడూరి శ్రీనివాస్‌ను ఎంబీసీ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించారు. అయితే ఆయన కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎంబీసీ జాతులకు సంబంధం లేదు. బాలసంతు, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటిపాపల, మొండిబండ, వంశరాజ్, పాముల, పార్థి, పంబాల, దేవరవారు, వీరభద్రీయ, గుడాల, కంజరభట్ట, కెంపుమారే, మొండిపట్టా, నొక్కార్, పరికిముగ్గుల, యాట, చోప్ మారి, కైకాడి, జోషినందివాలా, మందుల, కూనపులి, పట్ర, తలగారి, రాజన్నల, బుక్కఅయ్యవారు, గోత్రాల, కాశికాపుడి, సిద్దుల, సిక్లిగర్ జాతులతో అనాథలను కలిపి మొత్తం 36 జాతులను సంచార జాతులుగా పేర్కొంటూ ప్రభుత్వం అన్ని శాఖలకు జీవో పంపింది. ఎంబీసీలు ఎవరన్న క్లారిటీ ప్రభుత్వ శాఖల్లో కొరవడకూడదన్న ఉద్దేశంతో ఆ జాతుల వివరాలను ప్రకటించిన ప్రభుత్వమే ఆ విషయాన్ని మర్చిపోవడం దారుణం. కనీసం చైర్మన్ పదవిని కూడా ఆ జాతుల్లోని వారికి ఇవ్వకపోవడం ఆవేదనకు గురి చేసింది. మళ్లీ ఆ జాతుల పేరు చెబుతూనే ఇతర కులాలకు చెందిన వారికి పదవులు ఇవ్వడం ఎంబీసీలకు అన్యాయం చేయడమే. మరోవైపు ఈ మధ్యలో 13 కులాలను ప్రభుత్వం బీసీ–ఏలో చేర్చింది. ఆ కులాలు కూడా ఈ సంచార జాతికి చెందినవే, వాటిని ప్రభుత్వం అధికారికంగా ఎంబీసీలుగా గుర్తించాలి.
ఎంబీసీ పేరు చెప్పి బినామీ వర్గాలకు పదవులా?
రాష్ట్రంలో వివిధ బీసీ సామాజిక వర్గాలకు చెందిన కొంత మంది నేతలు అధికార పార్టీలోని పెద్ద నాయకులు, సీనియర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూ తామే ఎంబీసీ నేతలమన్నట్టు చలామణి అవుతున్నారు. బినామీ ఎంబీసీ నేతలుగా కొత్త అవతారాలెత్తుతున్నారు. కనీస గుర్తింపు లేని సంచార జాతులకు అన్యాయం చేస్తూ వారికి రావాల్సిన పదవులను తన్నుకుపోతున్నారు. ఏవి సంచార జాతుల కులాలు అన్న విషయంపై స్పష్టంగా సర్క్యులర్ ఉన్నా అధికార పార్టీలో కొంత మంది నేతలు లాబీయింగ్ కారణంగా బినామీలే పదవులు పొందుతున్నారు. వాళ్లే సంచార జాతులన్న భ్రమను కల్పించి నిజమైన ఎంబీసీలకు అన్యాయం చేస్తున్నారు.
ఘనంగా కార్పొరేషన్ ప్రారంభించినా..
రాష్ట్ర ప్రభుత్వం 2018లో అట్టహాసంగా ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి, దాని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పడంతో ఆ వర్గాలు సంతోషించాయి. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2,433 కోట్ల నిధులు కూడా కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత ఎంబీసీలకు సంబంధం లేని వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడం, కనీసం డైరెక్టర్లను నియమించకపోవడంతో సర్కారు చిత్తశుద్ధి ఎంతో అర్థమైపోయింది. ఇక బడ్జెట్లో కేటాయింపులకు ఘనంగా 2,433 కోట్లు అని ప్రకటించినా, నిధులు మంజూరు చేసింది మాత్రం రూ.350 కోట్లే. అందులోనూ రూ.89.79 కోట్లు మాత్రమే కార్పొరేషన్ అకౌంట్లో జమ చేశారు. ఆ నిధులను సంచార జాతుల అభివృద్ధికి ఖర్చు చేయడంలోనూ కార్పొరేషన్ నిర్లక్ష్యం చూపింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 3,65,456 మంది సంచార జాతులకు చెందిన వాళ్లు ఉన్నారు. కానీ కార్పొరేషన్ ఇప్పటి వరకు కేవలం 1,419 మందికి రూ.50 వేల చొప్పున గ్రాంట్ ఇచ్చి చేతులు దులుపుకొంది. మిగిలిన వారిలో ఏ ఒక్కరికీ రూపాయి సాయం కూడా అందలేదు.
ఉపాధి కల్పించాలె
సంచార జాతుల్లో మెజారిటీ జనం ఇంకా జీవనోపాధి లేక నానాకష్టాలు పడుతూ బతుకుతున్నారు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేక రోజుకో ఊరు తిరుగుతూ దొరికిన పని చేసుకోవడం లేదంటే ఆ పూటకు ఎవరొకరిని తిండి అడుక్కుని తిని బతుకీడుస్తున్నారు. దొరికిన దాంట్లో పిల్లలకు పెట్టి తాము పస్తులుండి, మోరీలు, రోడ్లు, ఫుట్ పాత్‌ల పక్కన పడుకుంటున్నారు. ఈ పరిస్థితిని సర్కారు ఇప్పటికైనా అర్థం చేసుకుని సంచార జాతులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం చేసి ఏదో ఒక ఉపాధి కల్పించాలి. సాటి మనుషులతో సమానంగా ఆత్మ గౌరవంతో బతికేందుకు సాయం చేయాలి.
పదవులకు అర్హులం కాదా
సంచార జాతుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూడేండ్లు గడిచింది. ఇన్నేండ్లలో కార్పొరేషన్ చేసిందల్లా 1419 మందికి ఆర్థిక సాయం ఒక్కటే. తొలి చైర్మన్ ను ఎంబీసీలకు సంబంధంలేని వ్యక్తిని పెట్టారు. ఆ వ్యక్తి పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తున్నా ఇంకా కొత్త చైర్మన్ ఎంపికపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదంటే సంచార జాతుల బిడ్డలు పదవులకు అర్హులు కాదన్న భావనలో ప్రభుత్వం ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా తోటి వారిని అభివృద్ధిలోకి తేవాలన్న ఆలోచన ఉన్న సంచార జాతులకు చెందిన నేతకు ఆ పదవి కట్టబెట్టాలి. – శ్రీనివాస్ తిప్పిరిశెట్టి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,