- వరంగల్ తూర్పులో ప్రదీప్‌రావు ఒకటి, శ్రీహరి 2 సెట్లు దాఖలు
- నర్సంపేట, భూపాలపల్లిలో 2 చొప్పున నామినేషన్లు
- స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, మహబూబాబాద్‌లో ఒక్కొక్కటి
వరంగల్/హనుమకొండ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఫస్ట్ రోజు 10 మంది 11 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 7, 9 తేదీల్లో మంచి రోజులు ఉండడంతో ఆ రోజుల్లో నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వరంగల్ తూర్పులో బీజేపీ క్యాండిడేట్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఒక సెట్ నామినేషన్ వేయగా, ఇండిపెండెంట్‌గా రాజనాల శ్రీహరి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ షేక్ రిజ్వాన్ బాషాకు అందజేశారు. నర్సంపేటలో ఎంసీపీఐయూ తరఫున పెద్దారపు రమేశ్, ఇండిపెండెంట్‌గా ఇమ్మడి చిన్ని కృష్ణ, పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా గజ్జి విష్ణు నామినేషన్లు వేశారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎలాంటి నామినేషన్లు రాలేదు.
మూడు నియోజకవర్గాలు.. రెండు నామినేషన్లు
జనగామ, వెలుగు : జనగామ జిల్లా పరిధిలో జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలు ఉండగా మొదటి రోజున జనగామ తప్ప మిగతా రెండు నియోజకవర్గాల్లో ఒక్కో నామినేషన్ దాఖలైంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ మండలం తాటికాయలకు చెందిన బొల్లెపు రాజేశ్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండలం నాంచారిమడూరుకు చెందిన మంద యాకమల్లు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
మహబూబాద్‌లో ఒక్కటి...
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మహబూబాబాద్ నియోజకవర్గంలో నెల్లికుదురు మండలం హనుమాన్‌నగర్ తండా శివారు కీమానాయక్ తండాకు చెందిన గుగులోతు వెంకన్న శుక్రవారం నామినేషన్ వేశారు. డోర్నకల్ నియోజకవర్గానికి ఎలాంటి నామినేషన్లు రాలేదు.
భూపాలపల్లిలో 2, ములుగులో నిల్
భూపాలపల్లి అర్బన్/ములుగు, వెలుగు : భూపాలపల్లి నియోజకవర్గంలో మొదటి రోజు రెండు నామినేషన్లు వచ్చాయి. బీజేపీ క్యాండిడేట్ చందుపట్ల కీర్తిరెడ్డి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ క్యాండిడేట్ గండ్ర సత్యనారాయణ తరఫున ఆయన భార్య పద్మ నామినేషన్ అందజేశారు.
ఎమ్మెల్యేగా గెలిపిస్తే భూపాలపల్లికి రైల్వే లైన్
భూపాలపల్లి అర్బన్/రూరల్, వెలుగు : తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే భూపాలపల్లికి రైల్వే లైన్ తీసుకొస్తానని బీజేపీ క్యాండిడేట్ చందుపట్ల కీర్తిరెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం నామినేషన్ వేసిన అనంతరం బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.
పదవుల కోసం పూటకో పార్టీ మార్చే నాయకులతో సమస్యలు పరిష్కారం కావన్నారు. ఆమె వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేంధర్, మండల అధ్యక్షులు, నాయకులు ఉన్నారు.