మా టాయిలెట్లు మస్తు నీటు.. స్వచ్ఛ సర్వేక్షణ్​ సర్వేకు వచ్చిన కేంద్ర బృందానికి బల్దియా మస్కా

మా టాయిలెట్లు మస్తు నీటు.. స్వచ్ఛ సర్వేక్షణ్​ సర్వేకు వచ్చిన కేంద్ర బృందానికి బల్దియా మస్కా
  • మంచిగున్న టాయిలెట్లు చూపించిన అధికారులు
  • 10 రోజుల పాటు కొనసాగనున్న సర్వే
  •  సిటీలోని 2,750 టాయిలెట్లలో 10 శాతం కూడా సక్కగ లేవు

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు కోసం బల్దియా అధికారులు కేంద్ర బృందానికి మస్కా కొడుతున్నారు. మంగళవారం కేంద్రం నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ టీమ్ వచ్చి నగరంలోని టాయిలెట్లను పరిశీలించింది. అయితే, మన బల్దియా అధికారులు మాత్రం వారిని తప్పుదారి పట్టించి నీట్​గా ఉన్న టాయిలెట్ల దగ్గరకు తీసుకువెళ్లి చూపించి శభాష్​ అనిపించుకున్నారు. 10 రోజుల స్వచ్ఛ సర్వేక్షన్​సర్వేలో భాగంగా నగరానికి వచ్చిన కేంద్ర బృందం టాయిలెట్ల శుభ్రత, వినియోగం, నిర్మాణ క్వాలిటీ చెక్ ​చేస్తోంది. అయితే, అధికారులు నిజాన్ని దాచి అబద్దాన్ని ప్రచారం చేసి ర్యాంకు కోసం తాపత్రయపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

24 డివిజన్లలో ఒక్క టాయిలెట్టూ లేదు
గ్రేటర్ లో బల్దియా నిర్వహిస్తున్న టాయిలెట్లు 2,750 ఉండగా, ఇందులో 10 శాతం కూడా సక్కగ లేవు. కొన్ని పూర్తిగా ధ్వంసమైనా పట్టించుకోవడం లేదు. ఇంకొన్ని టాయిలెట్ల వద్ద కనీసం నీళ్ల సౌకర్యం కూడా లేదు. కొన్నింటికి డోర్లు లేక ఓపెన్​గా ఉండగా, పని చేస్తున్న వాటికి తాళాలు వేశారు. వాస్తవానికి గ్రేటర్ లో 150 డివిజన్లుండగా, 24 డివిజన్లలో ఒక్క టాయిలెట్ కూడా లేదని జీహెచ్ఎంసీ లెక్కలు చెబుతున్నాయి.

హయత్ నగర్, సైదాబాద్, అక్బర్​బాగ్, ఆజంపురా, చవానీ, డబీర్ పురా, తలాబ్ చంచలం, కుర్మగూడ, లలిత్ బాగ్, మొగల్ పురా, శాలిబండ, ఫలక్ నుమా, రాజేంద్రనగర్, అత్తాపూర్, సులేమాన్ నగర్, శాస్త్రీపురం, ఆసీఫ్ నగర్, విజయనగర్ కాలనీ, మంగల్ హాట్, దత్తాత్రేయనగర్, శేరిలింగంపల్లి, భోలక్ పూర్, హయత్ నగర్, అడ్డగుట్ట, సీతాఫల్ మండి డివిజన్లలో అసలు టాయిలెట్లే లేవని బల్దియా అధికారులే చెప్తున్నారు.  

లూ– కేఫ్ ల వెనక టాయిలెట్లకు తాళాలు..
డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్(డీబీఎఫ్ వోటీ) పద్ధతిన నగరంలో 60  లూ కేఫ్ లను 2018 జులైలో జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఈ కేఫ్​లను ప్రారంభించింది. సిటీవాసుల టాయిలెట్ల సమస్య తీర్చడంతో పాటు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడమే దీని లక్ష్యం. వీటిని15 ఏండ్ల అగ్రిమెంట్ కింద మెస్సర్స్, ఇక్సోరా ఏజెన్సీలకు అప్పగించారు. లూ కేఫ్లో ముందు భాగంలో బిజినెస్​ కోసం స్పేస్ ఉంటుంది. ఇందులో పాన్​షాపులు, కిరాణాలు, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ షాపు వెనకే ఆనుకుని లగ్జరీ స్మార్ట్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు.

వీటిని వ్యాపారులు ఇచ్చిన అద్దెతో ఏజెన్సీలు మెయింటెయిన్​చేయాలి..అలాగే షాపు ఓనర్లు రాత్రి వెళ్లేప్పుడు తాళం వేసుకుని వెళ్లి ఉదయం షాపు తెరిచేప్పుడు వాటిని ఓపెన్​చేయాలి. ఇలా ఎక్కడా జరగడం లేదు. రెగ్యులర్ గా క్లీన్ చేస్తున్నారా? లేదా అనేది బల్దియా పర్యవేక్షించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో చాలా చోట్ల లూ కేఫ్​లో బిజినెస్​చేసే వ్యాపారులు వారు వేసిన తాళాలను వారికి అవసరం వచ్చినప్పుడే తీస్తున్నారు. మిగతా టైంలో ఎప్పుడూ తాళాలు వేసే కనిపిస్తున్నాయి.