జీసీసీకి బాకీపడ్డ ఐటీడీఏ
రూ.9 కోట్ల దాకా బిల్లులు పెండింగ్
ఐటీడీఏ చుట్టూ తిరుగుతున్న జీసీసీ ఆఫీసర్లు
అప్పులు చేసి నెట్టుకొస్తున్న హాస్టల్ వార్డెన్లు
భద్రాచలం, వెలుగు : గిరిజన ఆశ్రమ బడులు, గురుకులాలకు సరుకులు సప్లై చేస్తున్న జీసీసీకి ఐటీడీఏ రూ. కోట్లలో బకాయి పడింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 36 ఆశ్రమ బడులు, 11 సంక్షేమ హాస్టళ్లు, 28 గురుకులాలు ఉన్నాయి. వీటికి భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, దమ్మపేట, మణుగూరు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) బ్రాంచ్‌ల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. బియ్యం, పప్పులు, ఉప్పులు, కారం, పసుపు.. ఇలా హాస్టళ్లకు అవసరమయ్యే సరుకులు జీసీసీనే పంపిస్తోంది. టెండర్ ద్వారా ఈ సరుకులను ఆయా కంపెనీల నుంచి జీసీసీ తెప్పించి అందిస్తోంది. వీటికి సంబంధించిన బిల్లులు ఐటీడీఏ చెల్లిస్తుంది. ఆరు నెలలుగా సర్కారు నుంచి బిల్లులు రాకపోవడంతో రూ.8.81కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. బిల్లుల కోసం జీసీసీ ఆఫీసర్లు ఐటీడీఏ చుట్టూ తిరుగుతున్నారు.
అలసత్వమే ప్రధాన కారణం
ఐటీడీఏ డీడీ సెక్షన్లో ఆఫీసర్ల అలసత్వం కారణంగానే సకాలంలో బడ్జెట్ రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు బడ్జెట్ వివరాలు కమిషనర్ ఆఫీసుకు పంపించి అప్రూవల్ తీసుకోవాలి. కానీ అలా చేయడం లేదు. మరో వైపు సర్కారు కూడా ఫ్రీజింగ్ పెట్టడంతో ఇబ్బందులు వస్తున్నాయి. గత సంవత్సరం జూన్ నెల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లకు, గురుకులాలకు సంబంధించిన బిల్లులు రావాల్సి ఉంది. జీసీసీ ఆఫీసర్లు ఒక పక్క బిల్లులు కోసం తిరుగుతుంటే మరోవైపు లోకల్‌గా కొన్న సరుకులకు డబ్బు సర్దుబాటు చేసేందుకు వార్డెన్లు అప్పు చేస్తున్నారు. బంగారం తనఖా పెడుతున్నారు. అయినా ఇంకా కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు సంబంధించిన రూ.5కోట్ల 71లక్షల 37వేలు, గురుకులాలకు సంబంధించిన రూ. 3 కోట్ల10 లక్షల 27 వేలు నవంబరు నెల వరకు జీసీసీకి రావాల్సి ఉంది. డిసెంబరు నెల బకాయిలు కూడా కలిపితే సుమారు రూ.10 కోట్ల వరకు ఐటీడీఏ నుంచి రావాలి. ఈ బిల్లుల కోసం ఇప్పటికే జీసీసీ డివిజన్ నుంచి పీవోకు లెటర్లు కూడా రాశారు.
లక్షల్లో బకాయిలు
గుండాలలోని హాస్టల్లో 59 మంది వరకు స్టూడెంట్లు ఉన్నారు. ఇక్కడ చికెన్, ఎగ్స్ కు టెండర్లు లేవు. ఇవి వార్డెన్ కొనుగోలు చేసి వండించాలి. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రూ.1.5 లక్షల వరకు అప్పు చేసి మెనూ అమలు చేశారు. ఇవి కాక జీసీసీకి కూడా బడ్జెట్ రాలేదు. భద్రాచలంలోని ఓ హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి. అక్కడి వార్డెన్ బంగారం తనఖా పెట్టి మరీ స్టూడెంట్లకు మెనూ ప్రకారం వండించి పెడుతున్నారు. భద్రాచలం బాలికల ఆశ్రమ హాస్టల్లో గ్యాస్, కట్టెల కొనుగోలుకు ఇబ్బంది ఏర్పడుతోంది. నెలకు రూ.20 వేల చొప్పున ఖర్చు అవుతోంది. కొద్ది నెలలుగా బడ్జెట్ రాక తమ జీతాలు సైతం పిల్లల మెనూ కోసం వార్డెన్లు ఖర్చు పెడుతున్నారు. భద్రాచలం గురుకుల కాలేజీలో కూడా రూ.10 లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయి.
త్వరలో వస్తాయన్నారు
ఐటీడీఏ ఆశ్రమ, హాస్టళ్లు, గురుకులాల నుంచి రూ.8 కోట్ల వరకు బిల్లులు రావాలి. నవంబరు నెల వరకు బిల్లులు పంపినం. ఐటీడీఏ పీవోను కూడా కలిసి లెటర్ ఇచ్చినం. త్వరలో బడ్జెట్ వస్తదని చెప్పారు. బిల్లుల కోసం ఎదురుచూస్తున్నాం.
- విజయ్‌కుమార్, డీఎం, జీసీసీ, భద్రాచలం