వరంగల్​లో మహాలక్ష్మి ప్రయాణికులు.. 5 కోట్ల 78 లక్షల మంది

వరంగల్​లో మహాలక్ష్మి ప్రయాణికులు.. 5 కోట్ల 78 లక్షల మంది
  • రూ.293 కోట్ల 58 లక్షల ఆదాయం
  • ఆర్టీసీ వరంగల్‍ రీజియన్‍ ఆర్‍ఎం డి.విజయభాను 

వరంగల్‍, వెలుగు: ఉమ్మడి వరంగల్​లో గడిచిన ఆరున్నర నెలల్లో ఏకంగా 5 కోట్ల 78 లక్షల మంది మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్సు సేవలు వినియోగించుకున్నట్లు ఆర్టీసీ వరంగల్‍ రీజియన్‍ ఆర్‍ఎం డి.విజయభాను వెల్లడించారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్‍ 9న మహాలక్ష్మి స్కీం ప్రారంభించగా, 15వ తేదీ నుంచి జూన్‍ నెల చివరి వరకు వరంగల్‍ రీజియన్‍ పరిధిలోని 9 డిపోల పరిధిలో మొత్తంగా 9 కోట్ల 46 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.

ఇందులో 61 శాతంగా 5.78 కోట్ల మంది మహిళలు, విద్యార్థినులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారు. రీజియన్‍ పరిధిలో 367 రూట్లలో బస్సులు నడుస్తుండగా, ఆర్టీసీ 602, అద్దె బస్సులు 326 కలిపి మొత్తంగా 928 బస్సుల ద్వారా మహిళా ప్యాసింజర్లు ఫ్రీ జర్నీ చేశారు. పెరిగిన రద్దీ దృష్ట్యా జనాలు, లీడర్ల రెక్వెస్ట్​ మేరకు మరో 20 రూట్లలో బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. 

మహాలక్ష్మి కోసం మరో 78 కొత్త బస్సులు

రాష్ట్ర సర్కారు మహాలక్ష్మి పథకం ప్రారంభించాక, వరంగల్‍ రీజియన్‍కు 105 కొత్త బస్సులను కేటాయించింది. ఇందులో లహరి నాన్‍ ఏసీ 4, లహరి ఏసీ 4, రాజధాని 9, డీలక్స్​10, ఎక్స్​ప్రెస్​69, పల్లె వెలుగు 9 ఉండగా, కేవలం మహాలక్ష్మి స్కీం కోసం 78 కొత్త బస్సులు కేటాయించారు. మరో 100 బస్సుల వరకు రానున్నాయి. ఇక డిసెంబర్‍ నుంచి ప్రయాణికుల ద్వారా రీజియన్‍కు రూ.554 కోట్ల 63 లక్షలు టిక్కెట్ల రూపంలో ఆదాయం రాగా, ఇందులో రూ.293 కోట్ల 58 లక్షలు మహాలక్ష్మి పథకంలో సమకూరాయని ఆర్​ఎం వివరించారు.