జగిత్యాల, వెలుగు: జగిత్యాల ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్లో 5 యూనిట్లు ఉన్నాయి. మరో 5 యూనిట్లను పెంచేలా ప్రతిపాదనలు ఉన్నాయి. కోరుట్ల, ధర్మపురిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు 6 నెలలు క్రితం హామీ ఇచ్చినా అడుగులు ముందుకు పడడం లేదు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 146 మందికి పైగా డయాలసిస్ పేషెంట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా జిల్లాలో వెయ్యి మందికి పైగా డయాలసిస్ బాధితులు ఉన్నట్లు సమాచారం. జిల్లా ఆస్పత్రిలోని అందుబాటులో ఉన్న ఐదు యూనిట్లతో ప్రతీనెల సుమారు 50 పేషెంట్లకు మాత్రమే చికిత్స అందించే వెసులుబాటు ఉంది. దీంతో మిగిలిన బాధితులు కరీంనగర్, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్నారు. ప్రతీనెల రూ.15 నుంచి రూ.25 వేలు ఖర్చు అవుతోందని, సర్కార్ ఇచ్చే పింఛన్ రూ.2016 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని బాధితులు కోరుతున్నారు.
రూ.5 వేలు మంజూరు చేయాలి
డయాలసిస్ పేషెంట్లు, పేషెంట్ అటెండెంట్లు ఎలాంటి పని చేసుకోలేరు. వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్న రూ.2,016 పింఛన్పెంచాలి. స్పెషల్ కేటగిరిగా తీసుకుని రూ.5 వేలు మంజూరు చేయాలి. - జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ,జగిత్యాల
పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన పాల్వాజీ శ్రీనివాసా చారి ఎనిమిదేళ్లు గా కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నాడు. ధర్మపురిలో డయాలసిస్ సెంటర్ లేకపోవడంతో వారానికి రెండు సార్లు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేవాడు. అతడి భార్య భాగ్య కూలి పని చేస్తూ కూతురు, కొడుకును చదివిస్తోంది. కరీంనగర్ కు వెళ్లాలంటే వారాని కి రెండుసార్లు ఆటో లో వెళ్లి చికిత్స అందించేది భార్య. కూలి చేస్తే వచ్చిన డబ్బులు తిండి ఖర్చులకే సరిపోయేవి. రవాణా, ఇంటి ఖర్చుల భారంతో సుమారు రూ.15 వేలకు పైగా అప్పులైనట్టు భాగ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు నెలల క్రితం తీవ్ర ఆనారోగ్యం తో చారి మృతి చెందాడు. రెండెకరాలు అమ్మితే వచ్చిన డబ్బులు అప్పులు కట్టడానికే సరిపోయాయని భోరున విలపించింది. డయాలసిస్ పేషెంట్లకు ఏపీలోలాగా నెలకు రూ.10 వేలు కాకపోయినా నెలకు రూ.5 వేల పింఛన్ ఇచ్చినా తమలాంటి పేద కుటుంబాలకు మేలు జరుగుతుందని భాగ్య వాపోతోంది.