- ఖమ్మం పార్లమెంట్ లో పురుషుల కంటే 56,589 మంది మహిళా ఓటర్లు ఎక్కువ
- ఆకట్టుకునేందుకు అభ్యర్థులు, నేతల ప్రయత్నాలు
- వర్గాలుగా విడిపోయి వేర్వేరు పార్టీలకు మద్దతునిస్తున్న టీడీపీ
- మంత్రుల ర్యాలీల్లో వైసీపీ, జనసేన జెండాలు
- ఆసక్తికరంగా మారుతున్న రాజకీయం
ఖమ్మం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్ లో మహిళలు, యువత కీలకంగా మారారు. వారిని ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో లేడీస్ ఉండడంతో ప్రచారంలో వారినే టార్గెట్ చేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్యే ఎక్కువగా ఉంది. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో తుది ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 16,31,039 మంది ఓటర్లున్నారు. ఇందులో 8,43,749 మంది మహిళలు, 7,87,160 మంది పురుషులు, 130 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు.
మొత్తం పురుషులతో పోల్చుకుంటే 56,589 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక 18 నుంచి 19 ఏళ్ల లోపు వయస్సున్న వారు 50,747 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో 26,775 మంది యువకులు, 23,967 మంది యువతులున్నారు. వీరిలో కొందరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేయగా, మరికొందరు మాత్రం ఈపార్లమెంట్ ఎన్నికల్లోనే తొలిసారి ఓటు హక్కు ఉపయోగించుకోనున్నారు.
ఓటర్లను రీచ్డ అయ్యేందుకు ప్రయత్నాలు
ఇవాళ్టి సాయంత్రానికి ప్రచారం క్లోజ్ కానుండడంతో ఓటర్లను రీచ్ అయ్యేందుకు మరింత ఎఫర్ట్ పెడుతున్నారు. బైక్ ర్యాలీలు, రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రచారం ముగింపు దశకు వచ్చిన సమయంలో ఖమ్మంలో పొలిటికల్ పరిణామాలు కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసల తాకిడి కొనసాగుతోంది. పాలేరు నియోజకవర్గంలో శుక్రవారం కొందరు ముఖ్యనేతలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ముదిగొండ మండలంలోనూ చేరికలు కొనసాగుతున్నాయి.
వర్గాలుగా విడిపోయిన టీడీపీ!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ వర్గాలుగా విడిపోయింది. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టు టీడీపీ జిల్లా కమిటీ ప్రకటించిన తర్వాత, ఈ నిర్ణయంతో విభేదిస్తూ మరికొందరు టీడీపీ లీడర్లు కాంగ్రెస్ కు సపోర్ట్ ప్రకటించారు. ఖమ్మం పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రఘురాంరెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటుచేసి ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని భారీగా పెంచుకుంటామని ఆశపడ్డ బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మధిర, ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీల్లో వైసీపీ, జనసేన పార్టీల జెండాలు కూడా కనిపించడం ఆసక్తికరంగా మారింది.