మోడీ చక్కదిద్దాల్సిన చిక్కుముళ్లెన్నో.!

రెండో టర్మ్​ లో నరేంద్ర మోడీ చక్కదిద్దాల్సిన ఆర్థికపరమైన చిక్కుముళ్లు చాలానే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవైపు సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి సబ్సిడీలు కొనసాగిస్తూనే అవి సరైన వారికే  చేరేలా చూడటం కూడా ముఖ్యమంటున్నారు ఆర్థికరంగ నిపుణులు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం సర్కార్ ముందున్న ప్రధాన సవాల్.

నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన ముందు అనేక ఆర్థిక పరమైన సవాళ్లు ఉన్నాయి. వీటిలో సంస్కరణలు మొదటి వరుసలో ఉన్నాయి. మొదటి టర్మ్ లో  ప్రధాని మోడీ పన్నుల వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారు. లాబీయింగ్ ద్వారా  రాజకీయ నాయకులు, అధికారులు సొమ్ము కూడబెట్టుకునే  క్రోనీ కేపిటలిజానికి వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకున్నారు.  దేశమంతా ఒకేలా ఉండే జీఎస్టీ పన్నుల వ్యవస్థ ను ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పై పడింది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ జోరందుకుంది. అయితే ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ సంస్కరణలే సరిపోవంటున్నారు నిపుణులు. ప్రభుత్వ యంత్రాంగంలో  రెడ్ టేపిజాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ కంపెనీల దూకుడుకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కిందటేడాది డిసెంబర్ లో ఈ కామర్స్ కు సంబంధించి ప్రభుత్వం కొన్ని ఆంక్షలను ప్రకటించిన విషయాన్ని నిపుణులు గుర్తు  చేశారు.

ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను వెతుక్కోవడం కొత్త ప్రభుత్వానికి సాధారణమైన సవాలు కాదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి సబ్సిడీలు ఇస్తూనే, సరైన రీతిలో సరైన వ్యక్తులకు మాత్రమే చేరేలా చర్యలూ ముఖ్యమేనని చెబుతున్నారు. ఆదాయం తెచ్చి పెట్టే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాలలో ఎన్నో మార్పులు తెచ్చినప్పటికీ, ప్రత్యక్ష పన్నుల ఆదాయం పెంచుకోవడం మీదే ప్రధానంగా ప్రభుత్వ విజయం ఆధారపడుతుందని పేర్కొంటున్నారు.

ఎన్‌‌పీఏలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలోకి తేవడం ఒక ఎత్తైతే…. ప్రపంచ స్థాయి బ్యాంకులుగా వాటిని తీర్చిదిద్దడం మరో పెద్ద సవాలని అంటున్నారు. మరోవైపు శక్తి, సామర్ధ్యాలు లేక నీరసపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌‌యూ)ను చురుగ్గా ప్రైవేటీకరించడం, అనవసరమైన రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగడం కూడా కీలకమైన చర్యలేనని పేర్కొంటున్నారు.

10 లక్షల జాబ్స్​ ఎప్పుడో?

2014 ఎన్ని కలకు ముం దు తాము అధికారంలోకి వస్తే యువతకు పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాలనలో ఈ హామీని మోడీ
సర్కార్ నిలబెట్టుకోలేదన్న విమర్శలు జోరందుకున్నాయి. 1970ల తర్వాత దేశంలో ఇంతగా నిరుద్యోగం ఎన్నడూ లేదంటున్నాయి ఏకంగా సర్కారీ లెక్కలే. ఈ మేరకు లీకైన ప్రభుత్వ రిపోర్టు మీడియా లో వచ్చింది. ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కోరుకుంటున్న వారి మధ్య తేడా విపరీతంగా పెరిగిందన్నది వాస్తవం. కిందటేడాది రైల్వే మంత్రిత్వ శాఖలో 63 వేల ఖాళీలుంటే వాటి
కోసం 1.90 కోట్ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికి
మోడీ చర్యలు చేపట్టాలని ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. ఈ విషయంలో కేం ద్రం ఒక్కటే పనిచేస్తే చాలదంటున్నారు. రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్ ఇవ్వాలంటున్నారు. యువత కోసం ‘ఒకేషనల్
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ’ ఏర్పాటు చేయాలంటున్నారు. మరిన్ని చర్యలు తీసుకోవడం ద్వారా నిరుద్యోగాన్ని పూర్తిగా కాకపోయినా కొంతవరకు కట్టడి చేయవచ్చన్నది ఎక్స్ పర్స్ట్ అభిప్రాయం.

షాడో బ్యాంకింగ్ :

బ్యాంకింగ్ రంగం నిస్తేజంగా మారిన పరిస్థితుల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆర్థికపరమైన లావాదేవీలు జరపడం కొన్నేళ్లుగా జోరందుకుంది. దీన్నే ‘ షాడో బ్యాంకింగ్ ’ అంటారు. ఇలాంటి అతి పెద్ద షాడో బ్యాంక్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ లీజింగ్‌‌ అండ్‌‌ ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ (ఐఎల్‌‌ అండ్‌‌ ఎఫ్‌‌ఎస్‌‌) గత సెప్టెంబర్‌‌లో రుణ సంక్షోభంలో కూరుకుపోయింది. వందలాది గ్రూప్‌‌ కంపెనీలతో దివాలా బాటను ఈ గ్రూప్‌‌ పట్టడంతో దేశంలోని ఎన్నో నాన్‌‌ బ్యాంకింగ్‌‌ ఫైనాన్స్‌‌ కంపెనీలపై  ఆ ప్రభావం పడింది.

ఒకటొకటిగా లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ షాడో బ్యాంకింగ్ ప్రభావం లిక్విడిటీ పై పడుతుంది. చివరకు చెల్లింపులు పెద్ద సమస్యగా మారుతోంది. అంతేకాదు  ఇచ్చిన రుణాలు రాబట్టుకోవడం కూడా ఆయా సంస్థలకు పెద్ద టాస్క్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో  రెండోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షాడో బ్యాంకింగ్ పై  ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ .

ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి :

మోడీ తొలి టర్మ్​ లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లుగా ఇద్దరు రఘురాం రాజన్,  ఊర్జిత్ పటేల్  మారారు. రిజర్వ్ బ్యాంక్ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం రోజురోజుకూ  పెరుగుతోందన్న విమర్శలు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రఘురాం రాజన్ టర్మ్ ను సర్కార్ పొడిగించలేదు. ఊర్జిత్ పటేల్ కూడా పదవీ కాలం ముగియకుండానే కుర్చీ నుంచి దిగిపోయారు. పటేల్ స్థానంలో శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ అయ్యారు. ఆర్థిక వ్యవహారాల్లో శక్తికాంత దాస్ కు సుదీర్ఘ అనుభవం ఉంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయన పనిచేశారు.

ఎకనమిక్ అఫైర్స్  మినిస్ట్రీలో కూడా పనిచేసిన అనుభవం దాస్ సొంతం. రెండో టర్మ్ లో నైనా రిజర్వ్ బ్యాంక్ వ్యవహారాల్లో  కేంద్రం జోక్యం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానిగా మోడీ పై ఉందంటున్నారు నిపుణులు. గతంలో లాగే ప్రభుత్వ జోక్యం ఉంటే లాంగ్ రన్ లో ఆ ప్రభావం దేశ ఎకానమీ పై తప్పకుండా పడుతుందని ఎక్స్ పర్ట్స్  హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం అరికట్టడంతోపాటు, వడ్డీ రేట్లు, రూపాయి మారకపు విలువ నిర్ణయం వంటి అంశాలలో ఆర్‌‌బీఐ స్వేచ్ఛలో  కేంద్రం  జోక్యం చేసుకోకపోవడమే మంచి చేస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.