- పాల్వంచ,అంతర్గాం, ఆదిలాబాద్‌లో మంజూరు చేయండి..
- కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- బాపూఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాల రక్షణభూములు ఇవ్వండి
- త్వరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు శాంతి విగ్రహం, నాలెడ్జ్ హబ్
- మెడిటేషన్ విలేజ్ ఏర్పాటు
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో
- భేటీలో ముఖ్యమంత్రి వెల్లడి
- వరంగల్ ఎయిర్పోర్ట్ భూ సేకరణ కోసం ఏఏఐకి రూ.205 కోట్లు ఇచ్చినం
- పాల్వంచలోని భూ వివరాలు అందజేసినం
- అంతర్గాంలో 591 ఎకరాలు గుర్తించినం
- ఆదిలాబాద్‌లో అదనపు భూమిని అప్పగిస్తం
- పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌తో భేటీలో ప్రస్తావన
న్యూఢిల్లీ, వెలుగు: వరంగల్‌తోపాటు మరో మూడు చోట్ల ఎయిర్‌పోర్టులు మంజూరు చేయాలని, వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు చేపడ్తున్నామని, కేంద్రం కూడా సహకరించాలని, అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని, బాపూఘాట్ అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం బిజీబిజీగా గడిపారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో వరుస భేటీలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ప్రజలకు రవాణా వసతుల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని ఆయన వివరించారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ)ను జీఎంఆర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పొందిందని వెల్లడించారు.
253 ఎకరాల భూ సేకరణకు అవసరమైన రూ.205 కోట్లను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు అందజేసిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎయిర్పోర్ట్ పనులకు అవసరమైన అనుమతులు, అక్కడి నుంచి విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం విజ్ఞప్తి చేశారు.
పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్‌లోనూ..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు గతంలో గుర్తించిన స్థలం అనువుగా లేనందున ప్రత్యామ్నాయంగా పాల్వంచలో 950 ఎకరాలు గుర్తించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. ఆ భూమి వివరాలు ఏఏఐకి అందజేశామని, వెంటనే విమానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో గతంలో గుర్తించిన భూమి ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అనువుగా లేదని ఏఏఐ ప్రీ-ఫీజుబిలిటీ సర్వేలో తేలిందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్గాంలో 591.24 ఎకరాలు గుర్తించిందని, అక్కడ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో ఇప్పటికే 369.50 ఎకరాల భూమి ఉందని, పూర్తి స్థాయి కార్యకలాపాలకు అదనంగా 249.82 ఎకరాలు అవసరమని చెప్పారు. అదనంగా అవసరమైన భూమి సేకరించి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ కు వెంటనే ఎయిర్పోర్ట్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కె.రఘువీర్ రెడ్డి, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ఆర్.రఘురామిరెడ్డి, కడియం కావ్య కూడా ఉన్నారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు
హైదరాబాద్‌లో బాపూ ఘాట్ అభివృద్ధికి రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఆయనతో సీఎం సమావేశమయ్యారు. మహాత్మా గాంధీ చితాభస్మాన్ని కలిపిన చోట ఏర్పాటు చేసిన బాపూ ఘాట్ ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బాపూఘాట్ వద్ద గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం (మెడిటేషన్ విలేజ్), చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని రాజ్‌నాథ్‌కు వివరించారు.
ఇందుకోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.