హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్హత లేని వైద్యానికి ఆఫీసర్లు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండానే కొందరు డాక్టర్ల అవతారం ఎత్తుతున్నా పట్టించుకోవడం లేదు. ఫేక్ డాక్టర్ల పని పట్టేందుకు నెల రోజుల కింద ఆఫీసర్లు తనిఖీల పేరుతో హడావుడి చేశారు తప్పితే ఆ తర్వాత పట్టించుకోలేదు. కొన్నిచోట్ల అసలు తనిఖీలకు కూడా వెళ్లలేదు. తాజాగా టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో అసలు నిజాలు బయటపడుతున్నాయి.
ఉత్తుత్తి తనిఖీలే..
నకిలీ సర్టిఫికేట్లు, క్వాలిఫికేషన్ లేని డాక్టర్ల బాగోతం బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ లోని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లను జిల్లా వైద్యాధికారులు తనిఖీ చేశారు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 3 వరకు ఆసుపత్రుల్లో రైడ్స్ నిర్వహించారు. కానీ నామమాత్రంగా తనిఖీలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది కూడా పాస్ కాకుండా డాక్టర్ అవతారమెత్తినా, కాంపౌండర్లు, అటెండర్లే టెస్టులు చేస్తున్నా.. లింగనిర్ధారణ పరీక్షలు జరిగే హాస్పిటల్స్ఉన్నా లైట్తీసుకున్నారు. కేవలం హాస్పిటల్ రిజిస్ట్రేషన్, రెన్యూవల్ సర్టిఫికేట్స్, బయో మెడికల్ వేస్టేజ్ ట్రీట్మెంట్, ఆసుపత్రుల్లో అందించే సేవలకు సంబంధించి రేట్ల బోర్డులు ఉన్నాయో లేవో చూసి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో విద్యార్హత లేకుండానే చాలామంది ట్రీట్ మెంట్ చేస్తున్నారు.
రూల్స్ పాటించకున్నా ఓకే...
ఆసుపత్రులు, క్లినిక్ లలో తనిఖీలు చేసినప్పుడు కొందరు ఆఫీసర్లు అక్రమాలకు పాల్పడి అన్నీ సక్రమంగా ఉన్నాయనే రిపోర్టులు ఇచ్చినట్లు తెలిసింది. జనగామ జిల్లాలో మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఓ డాక్టర్ వరంగల్‌జిల్లాలోని ఓ నియోజకవర్గ కేంద్రంలో ఎలాంటి పర్మిషన్ లేకుండానే క్లినిక్ నడిపిస్తుండగా.. తనిఖీల్లో గుర్తించిన ఆఫీసర్లు కొంతమొత్తానికి సెటిల్మెంట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గం కేంద్రంలో అనుమతులు లేకుండా ల్యాబ్ నడిపిస్తూనే వైద్యుడి అవతారమెత్తిన ఓ ల్యాబ్ టెక్నిషియన్ వద్ద పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని వదిలేసినట్లు తెలిసింది. గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రసూతి సేవలందిస్తూ ఇదివరకు వివాదాలకెక్కిన ఓ హాస్పిటల్ రూల్స్పాటించకపోవడంతో అక్కడా సిబ్బంది చేతివాటం చూపించారనే ఆరోపణలున్నాయి. కొంతమంది పెద్ద డాక్టర్ల సర్టిఫికేట్లతో ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న హాస్పిటల్స్ ను కూడా సీజ్ చేయకుండా వదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టెన్త్ ఫెయిల్.. పదేండ్లుగా ట్రీట్ మెంట్
స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: పదో తరగతి ఫెయిలై, పదేండ్లుగా డాక్టర్ అవతారం ఎత్తిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లిలోని ప్రియాంక క్లినిక్ పై సోమవారం వరంగల్ టాస్క్ ఫోర్స్, స్టేషన్‌ఘన్‌పూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. క్లినిక్ నిర్వాహకుడు ఆకాశ్ బిశ్వాస్ టెన్త్ ఫెయిలై, డాక్టర్ అవతారం ఎత్తి, పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. గతంలో అతని తాత ఆయుర్వేద డాక్టర్ గా పనిచేయగా.. అతని వద్ద కొద్దిపాటి వైద్యాన్ని నేర్చుకున్నాడు. అదే అనుభవంతో ఆయుర్వేదంతో పాటు నార్మల్ పేషెంట్లకు కూడా ట్రీట్ మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. పైల్స్, ఫిషర్, బ్లీడింగ్ పైల్స్, ఫిస్టులా హైడ్రోల్ వ్యాధులతో బాధపడే రోగులను టార్గెట్‌చేసుకుని అక్రమంగా డబ్బు గుంజాడు. పదేండ్లుగా 3,560 మంది రోగులకు ట్రీట్ మెంట్ చేశాడు. వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే హనుమకొండ, వరంగల్సిటీల్లోని కార్పొరేట్హాస్పిటల్స్కు రిఫర్ చేసేవాడు. అక్కడి నుంచి కూడా కమీషన్లు దండుకునేవాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు చేసి, క్లినిక్ పరికరాలు, మెడిసిన్ సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. దాడులు చేసిన ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు నరేశ్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్ఐ లవకుమార్, సిబ్బందిని వరంగల్టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందించారు.
టాస్క్ ఫోర్స్ రైడ్స్ లో బట్టబయలు
జిల్లా వైద్యాధికారుల బృందాలు తనిఖీలు చేపట్టినా బయట పడని అక్రమాలు, ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్స్ లో వెలుగులోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 27న వరంగల్ నగరంలో ఇద్దరు ఫేక్ డాక్టర్లు పట్టుబడగా.. తాజాగా స్టేషన్ ఘన్ పూర్ లో ఒకరు పట్టుబడ్డారు. దీంతో మెడికల్ ఆఫీసర్ల పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా వైద్యాధికారులు అక్రమాలకు తావు లేకుండా తనిఖీలు చేపట్టి, ఫేక్ డాక్టర్లు, అర్హత లేని వైద్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు
విజ్ఞప్తి చేస్తున్నారు.