- అక్రమాల్లో కొప్పుల, హరీశ్, వాసుదేవరెడ్డి, శైలజ పాత్ర: ముత్తినేని వీరయ్య
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కార్పొరేషన్ లో సుమారు రూ.40 కోట్ల స్కామ్ జరిగిందని ఆ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆరోపించారు. దివ్యాంగులకు అందాల్సిన స్కీములు, ట్రై సైకిళ్లు, త్రీ వీలర్స్ పక్కదారి పట్టించారని తెలిపారు. అందులో అప్పటి మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, చైర్మన్ వాసుదేవ రెడ్డి, డైరెక్టర్ శైలజ పాత్ర ఉందని ఆయన చెప్పారు. సోమవారం సెక్రటేరియెట్ మీడియా పాయింట్ లో వీరయ్య మాట్లాడారు. గత పదేండ్లలో దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్ని నిధులు వచ్చాయి.. ఎంత ఖర్చు అయ్యాయన్న లెక్కలు లేవని ఆయన తెలిపారు. హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గాలైన సిద్దిపేట, ధర్మపురిలో 500 త్రీ వీలర్స్ పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు.
దివ్యాంగుల జాయింట్ డైరెక్టర్ పోస్టును అప్ గ్రేడ్ చేయాలంటే కేబినెట్ అనుమతి తీసుకోవాలని.. కానీ, ఎలాంటి ఆప్రూవ్ తీసుకోకుండా హరీశ్ రావు ఫైనాన్స్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి జేడీ పోస్టును డైరెక్టర్ పోస్ట్ గా అప్ గ్రేడ్ చేయించారని ఆయన ఆరోపించారు. దివ్యాంగులకు ఇవ్వాల్సిన పరికరాల ఫండ్స్ ను చైర్మన్ వాసుదేవ రెడ్డి, డైరెక్టర్ శైలజ ఆఫీస్ రెనోవేషన్ కు ఖర్చు చేశారని, ఇందుకు ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోలేదని వీరయ్య ఆరోపించారు. ఈ అవినీతిపై అన్ని వివరాలు తన దగ్గర ఉన్నాయని.. వాటిని ఏసీబీ, విజిలెన్స్ కు అందజేస్తాని ఆయన ప్రకటించారు. పదేండ్ల అవినీతిపై విజెలెన్స్, ఏసీబీ ఎంక్వైరీ జరిపిస్తామని.. బాధ్యులకు శిక్షపడడం ఖాయమని ఆయన హెచ్చరించారు.