- సీఎంఆర్ బియ్యంపై ఆఫీసర్ల నిర్లక్ష్యం
- రైస్ మిల్లర్లతో ఇంకా కుదరని ఒప్పందం
- వడ్లు కొంటున్నా మిల్లులకు కేటాయించట్లే!
గద్వాల, వెలుగు: సీఎంఆర్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై ఆఫీసర్లు, ఇతర ఉన్నతాధికారులు కుమ్మక్కయ్యారనే విమర్శలున్నాయి. డిఫాల్టర్లయిన రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టినా ఆర్ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లకు కోట్ల విలువ చేసే వడ్లు కేటాయించగా, చాలా మంది మిల్లర్లు బియ్యాన్ని అప్పగించలేదు.
దీన్ని అప్పటి అధికారులు పట్టించుకోలేదు. సివిల్ సప్లై అధికారుల దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి ఆఫీసర్ వరకు రైస్ మిల్లర్లకు సపోర్ట్ చేశారని, కేసులు పెట్టి వారు కోర్టుకు వెళ్లేలా వెసులుబాటు కల్పించారనే ఆరోపణలున్నాయి.
7,520 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇయ్యలే..
జోగులాంబ గద్వాల జిల్లాలో 2021–22 నుంచి 11 రైస్ మిల్లులు 7,520 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. అయిజలోని అన్నపూర్ణ ట్రేడర్స్, శాంతినగర్ లోని సూర్య ట్రేడర్స్, గద్వాల మండలం కాకులారంలోని కృష్ణ రైస్ మిల్లుల నుంచి 3,952 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది. ఈ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఈ మిల్లర్ల మీద ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి.. ఆస్తులు జప్తు చేయాల్సి ఉండగా అధికారులు పట్టించుకోలేదు. ఇతర జిల్లాల్లో ఆర్ఆర్ యాక్ట్ పెట్టడంతో పాటు అరెస్ట్ కూడా చేస్తున్నారు. మరో 8 రైస్ మిల్లులు కూడా సీఎంఆర్ అప్పగించకపోయినా వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
గత తప్పిదాలే ఇప్పుడు శాపం..
జోగులాంబ గద్వాల జిల్లాలో 61 రైస్ మిల్లులు ఉండగా, అందులో 2021–- 22 నుంచి సీఎంఆర్ బాకీ ఉండడంతో 11 మిల్లులను డిఫాల్టర్‌గా ప్రకటించారు. ఈ మిల్లులకు ఈ సీజన్లో వడ్లు కేటాయించవద్దని అధికారులు నిర్ణయించారు. మరో 8 రైస్ మిల్లుల నిర్వాహకులు సెక్యూరిటీ డిపాజిట్ కట్టి అగ్రిమెంట్ చేసుకుంటే, వారికి వడ్లు కేటాయిస్తారు. మిగతా రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ఒక్క రైస్ మిల్లు కూడా ఇవ్వలేదు. కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొంటున్నా.. ఇంకా మిల్లులకు పంపడం లేదు. మొదటి నుంచి మిల్లర్లతో కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు అంటున్నారు.
ప్రాసెస్ కొనసాగుతోంది..
సీఎంఆర్ అప్పగించని రైస్ మిల్లర్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాం. ఆర్ఆర్ యాక్ట్ కింద కూడా నోటీసులు ఇచ్చాం. బియ్యం ఇవ్వని అన్ని రైస్ మిల్లులపై చర్యలు ఉంటాయి.–విమల,డీఎం, సివిల్ సప్లై