టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాలు

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాలు
  • ఇష్టారీతిన ప్లాట్లు కేటాయిస్తున్నారని ఆరోపణలు
  • సీరియల్​ నంబర్ల ప్రకారం ఇవ్వడం లేదని ఆవేదన 
  • డెవలప్‌ మెంట్ చార్జీలు ప్లాటుకు రూ. లక్ష వసూలు 
  • బిల్డర్‌‌తో ఇల్లు కట్టించుకుంటేనే ప్లాట్ కేటాయింపు 
  • అక్రమాలపై సీసీఎల్ఏకు ఫిర్యాదు చేసిన బాధితులు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల టీఎన్​జీవో హౌసింగ్ సొసైటీలో అనేక అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2010లో కేటాయించిన నంబర్ల ప్రకారం కాకుండా రీడిజైన్ పేరిట ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తున్నారని, సీరియల్ నంబర్ల ప్రకారం ఇవ్వడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఒక్కో ప్లాటుకు డెవలప్మెంట్ చార్జీల పేరిట రూ.లక్ష, ఎన్​వోసీ పేరిట రూ.30వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదని, బిల్డర్‌‌ కు  రూ.5లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటేనే ప్లాట్​ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇలా దాదాపు 100 మంది వద్ద కోటికి పైగా వసూలు చేశారని తెలుస్తోంది.  సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్‌‌కు కంప్లయిట్ చేసినా స్పందన లేకపోవడంతో ఇటీవల సీసీఎల్ఏకు సైతం ఫిర్యాదు చేసినట్టు పలువురు సభ్యులు తెలిపారు. 

ఆదినుంచి వివాదాలే... 

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ భూములపై ఆదినుంచి వివాదాలు ముసురుకున్నాయి.  నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 42 సర్వేనంబర్ లో  సొసైటీకి32 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించారు. 2010లో దాదాపు 350 ​మెంబర్స్​కు ప్లాట్లు కేటాయిస్తూ అప్పటి తహసీల్దార్ పట్టా సర్టిఫికెట్లు జారీ చేశారు. అయితే ఈ భూమిని గతంలో ప్రభుత్వం తమకు అసైన్ చేసిందని నస్పూర్‌‌కు చెందిన కొంతమంది హైకోర్టులో  కేసు వేశారు.  ఇందులో 9 ఎకరాలకు కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో సొసైటీ స్వాధీనం చేసుకుంది. ఇందులో పలువురు ఇండ్లు కట్టుకున్నారు. 

రెండెకరాలు పరులపాలు.... 

హైకోర్టు కేసు విషయంలో కొంతమంది జోక్యం చేసుకొని కేసు వేసినవారితో కాంప్రమైజ్​ చేయించారు. ఇందుకుగాను అసైన్డ్ దారులకు రెండెకరాలు కేటాయించగా, వారు ఇతరులకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాట్లలో కొంతమంది బయటి వ్యక్తులు బిల్డింగులు కడుతుండగా వాటికి పర్మిషన్లు లేవంటూ మున్సిపల్ అధికారులు కూల్చేశారు.  హౌసింగ్ సొసైటీకి కేటాయించిన కోట్ల విలువైన భూమిని కాంప్రమైజ్ కింద ఏ అధికారంతో ఇతరులకు కట్టబెట్టారని సభ్యులు ప్రశ్నిస్తున్నారు.  బీఆర్ఎస్​ లీడర్​ అయిన  సింగరేణి ఎంప్లాయి సొసైటీ భూమిలో ఐదంతస్తుల బిల్డింగ్ కట్టినా అటు యూనియన్ లీడర్లు, ఇటు ఆఫీసర్లు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 

ప్లాట్ల కోసం ఉద్యోగుల పాట్లు....

టీఎన్జీవో మెంబర్స్ సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదని, సొసైటీ భూముల్లో పాగా వేసిన ఒక బిల్డర్‌‌కు రూ. 5 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటేనే ప్లాట్లు కేటాయిస్తున్నారని సభ్యులు మండిపడుతున్నారు. 2010లో జారీచేసిన ఫైనల్​ పట్టా సర్టిఫికెట్​లోని ప్లాట్​ నంబర్ల ప్రకారం సీరియల్​నంబర్లు పాటించకుండా ఇష్టారీతిన కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. బిల్డర్​కు రూ.5లక్షల చెక్కు ఇవ్వలేని వారికి వారి ఫైనల్​ పట్టా సర్టిఫికెట్​లో గల నంబర్​ ప్రకారం ప్లాట్లు ఇవ్వడం లేదంటున్నారు.  ఫస్ట్​ ఫేస్​లో పట్టా సర్టిఫికెట్లు ఉన్న 81, 92, 119, 120, 131 నంబర్లతో పాటు చాలామందికి నేటికీ ప్లాట్లు ఇవ్వడం లేదని వాపోతున్నారు.

120, 165 ప్లాట్​ నంబర్లు గలవారు డెవలప్​మెంట్​ చార్జీల​ కింద రూ.లక్ష చెల్లించి రెండు సంవత్సరాలు అవుతున్నా ప్లాట్​ కేటాయించలేదని తెలిపారు. ఒరిజినల్​ లిస్టులో బై నంబర్లు గల ప్లాట్లు లేకున్నా అప్పటి అధ్యక్షుడు 141, 344, 187 నంబర్ ప్లాట్లను 77/ఏ, 77/బీ, 4/ఏ నంబర్లు వేసి రీఅలాట్మెంట్ చేశారు. ఇలా రీడిజైన్, రీఅలాట్మెంట్ చేసే అధికారం కలెక్టర్ కు మాత్రమే ఉంది. రీడిజైన్ చేసిన వాటిలో దాదాపు వంద మందికి ఇప్పటికీ ప్లాట్లు కేటాయించకపోవడంతో యూనియన్ లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు. డెవలప్మెంట్ చార్జి రూ.లక్ష చెల్లించినా ప్లాట్లు ఎందుకు ఇస్తలేరని ప్రశ్నిస్తున్నారు. 

ఇల్లు కట్టుకుంటామంటే ప్లాట్​ ఇయ్యట్లే...

2010లో నాకు 231 నంబర్​ ప్లాట్​ కేటాయిస్తూ పట్టా సర్టిఫికెట్​ ఇచ్చారు. నేను సొంతంగా ఇల్లు కట్టుకుంటామంటే ప్లాట్ ఇయ్యట్లే. బిల్డర్​కు రూ.5లక్షల చెక్కు ఇచ్చి అగ్రిమెంట్​ చేసుకుంటేనే ప్లాట్​ ఇస్తమని ఇబ్బంది పెడుతున్నరు. పట్టా సర్టిఫికెట్​లో ఉన్న సీరియల్​ నంబర్ల ప్రకారం కాకుండా ఇష్టారీతిన ప్లాట్లు ఇస్తున్నరు. 

ఖుర్షీద్​, రిటైర్డ్​ సబ్​ రిజిస్ర్టార్​

ఆరోపణలు అవాస్తవం... 

హౌసింగ్​ సొసైటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నరు. సొసైటీ భూమిలోంచి కలెక్టరేట్​ రోడ్డు పోవడంతో ప్లాట్​ నంబర్లు చేంజ్​ అయినయి. ఇంకా ఐదెకరాలు కేసులో ఉన్నది. సొంతంగా ఇల్లు కట్టుకుంటామంటే ప్లాట్​ చూపిస్తం. డెవలప్​మెంట్​చార్జీల పైసలకు లెక్కలున్నయి. 

జి.శ్రీహరి, టీఎన్​జీవో ప్రెసిడెంట్​