బ్యాంకులు బాదేస్తున్నయ్​ బాబోయ్‌.. హిడెన్​ చార్జీలు ఎన్నో .. వీటిపై అవగాహన తప్పనిసరి

బ్యాంకులు  బాదేస్తున్నయ్​ బాబోయ్‌.. హిడెన్​ చార్జీలు ఎన్నో .. వీటిపై అవగాహన తప్పనిసరి

న్యూఢిల్లీ: మనదేశంలోని బ్యాంకులు ఎన్నో రకాల సేవలు అందిస్తుంటాయి. వీటిలో ఉచితంగా అందించే వాటికంటే చార్జీలు పడేవే ఎక్కువ ఉంటాయి. ఈ సంగతి తెలియక చాలా మంది నష్టపోతున్నారు. ఫండ్ ​ట్రాన్స్​ఫర్స్​, ఏటీఎం విత్​డ్రాయల్స్​, సీడీఎం డిపాజిట్స్​, మినిమం బ్యాలెన్స్​ లేకపోవడం వంటి వాటికి భారీగానే చార్జీలు వేస్తున్నాయి. అయితే చార్జీలు ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంటాయి. ఖాతాల రకాన్ని బట్టి కూడా ఇవి మారవచ్చు. కరెంటు ఖాతా అయినా, సేవింగ్స్​ ఖాతా అయినా చార్జీల బాదుడు ఉండవచ్చు. చాలా మంది ఖాతాదారులు తమ బ్యాంక్ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లను పూర్తిగా పరిశీలించరు. వీరు తమకు తెలియకుండానే కొన్ని చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. చార్జీలు చిన్నవిగా కనిపించినప్పటికీ, కాలక్రమేణా పెద్ద మొత్తంలోకి మారవచ్చు. వీటి గురించి ముందే తెలుసుకుంటే ఎంతో డబ్బు ఆదా చేయొచ్చు. 

చార్జీల వివరాలు.... 

 మినిమం బ్యాలెన్స్‌ చార్జీలు : చాలా సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్​ను ఉంచడం తప్పనిసరి. ఇది పరిమితి కంటే తక్కువకు పడిపోతే సాధారణంగా రూ. 300 నుంచి 1,000 వరకు జరిమానా పడుతుంది. చార్జీలు ఖాతాలను, బ్యాంకులను బట్టి మారుతాయి.

 ఏటీఎం  విత్‌‌‌‌డ్రాయల్స్ : బ్యాంకులు సాధారణంగా బ్యాంక్  సొంత ఏటీఎంల నుంచి డబ్బులు తీస్తే చార్జీలు వసూలు చేయవు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి తీస్తే రూ. 20–-50  మధ్య చార్జీలు ఉంటాయి. క్యాష్ ​డిపాజిట్ ​మెషీన్​(సీడీఎం) ద్వారా డబ్బులు డిపాజిట్​ చేసినా చార్జీలు పడతాయి. నెలవారీ ఉచిత పరిమితులు దాటాక ఒక్కో లావాదేవీకి రూ.23 చొప్పున చార్జ్​ చేయాలని ఆర్​బీఐ తాజాగా బ్యాంకులను ఆదేశించింది.

 చెక్​ బౌన్స్ ఫీజులు : చెక్కులు బౌన్స్ అయినందుకు బ్యాంకులు జరిమానా విధిస్తాయి. ఇవి రూ. 250 నుంచి రూ. 500 వరకు ఉంటాయి.  ఉచిత పరిమితి అయిపోయిన తర్వాత చెక్​ బుక్​ జారీ చేయడానికి చార్జీలు ఉంటాయి. 25 చెక్కులు ఉన్న బుక్​కు  రూ. 100 వరకు వసూలు చేస్తారు.

ఫండ్ ​ట్రాన్స్​ఫర్​ ఫీజులు: నెఫ్ట్​, ఆర్టీజీస్​ విధానాల్లో డబ్బులు పంపినా చార్జీలు ఉండొచ్చు. ఎస్​బీఐలో నెఫ్ట్​ ద్వారా రూ.10 వేల వరకు పంపితే రూ.2.25 , రూ.10 వేల  నుంచి రూ. లక్షలోపు అయితే రూ.నాలుగు తీసుకుంటుంది.   ఈ సేవలను ఉచితంగానే అందించే బ్యాంకులూ ఉన్నాయి. త్వరలో యూపీఐ, రూపే ట్రాన్సాక్షన్లపైనా చార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

 లోన్ ప్రాసెసింగ్ ఫీజులు: బ్యాంకర్లు లోన్ మొత్తంలో 0.5 నుంచి 2 శాతం వరకు లోన్ ప్రాసెసింగ్ కోసం చార్జ్ చేస్తారు. రివార్డు పాయింట్లతో ఏమైనా కొన్నా ప్రాసెసింగ్ ​ఫీజులను వసూలు చేస్తాయి.

 ఖాతా నిర్వహణ ఫీజులు: కొన్ని రకాల అకౌంట్​ హోల్డర్లు, ముఖ్యంగా కరెంట్ ఖాతాల కస్టమర్లు బ్యాంకు విధించిన రూల్స్​ పాటించకపోతే నష్టపోతారు. మంత్లీ మెయింటెనెన్స్​ చార్జీలను భరించాల్సి ఉంటుంది. ఇయర్లీ చార్జీలు రూ. 500 నుంచి రూ. 1,500 వరకు ఉండవచ్చు.

 ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్ చార్జీలు: ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్ (నెగటివ్ బ్యాలెన్స్) ఉన్న ఖాతాలకు బ్యాంకులు చాలా ఎక్కువ చార్జీలు విధిస్తాయి. ఇవి ఒక్కోసారి రూ. 400 నుంచి రూ. 800 వరకు ఉండవచ్చు.

 అదనపు సేవా చార్జీలు: ఎస్​ఎంఎస్ ​బ్యాంకింగ్​, మిస్డ్​కాల్​ సర్వీస్​ వంటి బ్యాలెన్స్​ కన్ఫర్మేషన్​ సర్వీసుల కోసం బ్యాంకులు  సుమారు రూ. 50-–రూ. 100  వరకు తీసుకుంటాయి. స్టాప్ పేమెంట్ సూచనలను అమలు చేయాలంటే దాదాపు రూ. 120 చార్జీ పడుతుంది.  పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా లావాదేవీలు చేస్తే రూ. 250 చెల్లించాలి.  

చార్జీలను తప్పించుకోండి ఇలా...

చార్జీలను తప్పించుకోవాలంటే ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌‌లను ఉంచడాన్ని మర్చిపోకూడదు.  వీలైనంత వరకు బ్యాంక్​ నెట్‌‌వర్క్ ఏటీఎం లను ఉపయోగించాలి.  ఖర్చుల కోసం రెగ్యులర్ డైరెక్ట్ డిపాజిట్ల ఖాతాలను ఉపయోగించాలి. వీటికి కొన్ని బ్యాంకులు చార్జీలు వసూలు చేయవు. బ్యాంకు స్టేట్‌‌మెంట్లను జాగ్రత్తగా పరిశీలిస్తే రహస్య/ ఊహించని చార్జీల గురించి తెస్తుంది. 

మనీ ట్రాన్స్​ఫర్, లోన్​, బిల్స్​ పేమెంట్​ కోసం యూపీఐ వంటి  డిజిటల్​ పేమెంట్లను ఉపయోగించండి. ఓవర్‌‌డ్రాఫ్ట్ చార్జీలను నివారించడానికి మీ చెకింగ్ ఖాతాను సేవింగ్స్ ఖాతాకు లేదా క్రెడిట్ లైన్‌‌కు కనెక్ట్ చేయండి.   లావాదేవీల ఖర్చులను తగ్గించుకోవడానికి చిన్న చిన్న వాటికి బదులు ఒకేసారి పెద్ద లావాదేవీలు చేయడం మంచిది. చార్జీల గురించిన తాజా సమాచారాన్ని బ్యాంకు నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.