డిప్రెషన్ అనేది ఏ వయసులో అయినా రావొచ్చు. డిప్రెషన్‌కి కారణాలు ఎన్నో ఉండొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్లలో ఉండే చాలా కాంప్లికేషన్స్‌కి కారణం డిప్రెషన్ అని అర్థం చేసుకోవటం అవసరం. అయితే డిప్రెషన్ అనగానే అందరూ ఒకేలాగా ప్రవర్తిస్తారని… ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తాయని అనుకోవద్దు. లైఫ్ స్టైల్ ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి కూడా డిప్రెషన్ లక్షణాలు మారిపోతుంటాయి. ముఖ్యంగా మెనోపాజ్ దశ దాటిన ఆడవాళ్లలో ఉండే డిప్రెషన్ ని చాదస్తం, చిరాకు అని కొట్టి పారేయకుండా వాళ్ల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి.
జనరల్‌గానే వయసు మీద పడుతున్న వాళ్లలో ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ అని మాత్రమే అనుకుంటాం. కానీ దాని వెనక కారణాలు మెంటల్ హెల్త్ కి సంబంధించినవి కూడా అయ్యుండొచ్చు. ముఖ్యంగా మన దేశంలో వయసు పెరుగుతున్నా కూడా ఫ్యామిలీ అవసరాలని చూసుకునేది ఆడవాళ్లే. యాభైయ్యేళ్లు దాటినా ఇంటి పనులన్నీ చేసే వాళ్లని చూస్తూనే ఉంటాం.
ఫ్యామిలీలో అందరి అవసరాల తర్వాతే తమ విషయం చూసుకుంటారు. ఈ ప్రాసెస్‌లో వాళ్లకి తెలియకుండానే లైఫ్‌లో ఒక మొనాటనీ వస్తుంది. కొన్నిసార్లు అది వాళ్లకి కూడా అర్థం కాకపోవచ్చు. లైఫ్ అంటే ఇక ఇంతేనా? అనేలాంటి ఒక ఫీలింగ్ పెరిగిపోతుంది. దానివల్ల చిరాకు, అసహనం వస్తాయి. వీటి ప్రభావమే నిద్ర లేకపోవటం, అలసట, ఒళ్లు నొప్పులు లాంటి ఫిజికల్ ఇల్‌నెస్‌కి కారణం అవుతోంది. అందుకే 50 ఏళ్లు దాటుతున్నాయి అంటే ఆడవాళ్ల హెల్త్‌కి కారణం మానసికం కూడా కావచ్చు అని ఆలోచించాలి.
మెనోపాజ్
45–50 సంవత్సరాల వయసు మధ్యలో పిరియడ్స్ రావటం ఆగిపోతుంది. ఇలా అవటాన్నే ‘‘మెనోపాజ్” అంటారు. ఇది జబ్బు కాదు. అందరిలోనూ ఉండేదే. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి తగ్గిపోవటం, మెటబాలిజంలో వచ్చే మార్పులు రెగ్యులర్ లైఫ్ స్టైల్ మీద ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల అలసట, చిరాకు పెరిగిపోతుంది. అంతేకాదు ఇక నా జీవితం లో సగం అయిపోయినట్టే అనే ఫీలింగ్ మొదలవుతుంది. మెనోపాజ్ వస్తే లైంగిక జీవితం ముగిసినట్టే అనుకుంటారు ఎక్కువమంది. అది కూడా డిప్రెషన్‌కి కారణం అవ్వొచ్చు. మెనోపాజ్ మొదలు కావటానికి ముందు, మెనోపాజ్ తర్వాత బాడీలో వచ్చే మార్పులు ఎమోషనల్ ఛేంజెస్‌కి కూడా కారణం అవుతాయి. దీనివల్ల మూడ్‌ని రెగ్యులేట్ చేసుకోవటం కష్టం అవుతుంది. దాంతో చిన్న విషయాలకే చిరాకు పడటం, ఓవర్‌గా రియాక్ట్ అవటం ఉంటుంది. లేదంటే పూర్తిగా డల్‌గా అయిపోతారు. మతిమరుపు వస్తుంది.
పెద్ద వయసులో
60 ఏళ్లనుంచీ మరో రకమైన డిప్రెషన్ రావొచ్చు. ఏడడుగులు కలిసి నడిచిన మనిషి చనిపోవటం, ఒంటరిగా ఉండాల్సి రావటం. పిల్లలు వేరే దేశంలో ఉంటూ వీళ్లని డైరెక్ట్ గా పట్టించుకోలేక పోవటం వల్ల కూడా ఒంటరిగా ఫీలవుతారు. మెనోపాజ్ ప్రభావానికి తోడు ఈ కారణాలు కూడా వాళ్ల మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తాయి. లాక్ డౌన్ పిరియడ్ తర్వాత ఇలా పిల్లలకి దూరంగా ఉన్న వాళ్లలో ఈ రకమైన డిప్రెషన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరూ నన్ను పట్టించుకోవటం లేదనే ఆలోచనలు వాళ్లని కుంగదీస్తాయి.
అర్థం చేసుకోవాలి
50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్లు ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్యసమస్యతో బాధ పడుతున్నారు అంటే వాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారని కూడా అర్థం చేసుకోవాలి. వాళ్లతో మాట్లాడి అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఒంటరితనం అంటే ఎవరూ ఉండకపోవటం కాదు. పట్టించుకోక పోవటం కూడా. వాళ్లేదైనా సలహా ఇచ్చినా, ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా ఓపికగా వినాలి. పెద్ద వాళ్లని ఫ్యామిలీలో ఒకరిగా గుర్తించాలి.
అప్పుడప్పుడు ఏదైనా సలహా అడగటం. ఆఫీసులో జరిగే విషయాలు చెబుతూ టైమ్‌పాస్ చేయాలి. లేదంటే మమ్మల్ని పట్టించుకోవటం లేదనే ఫీలింగ్ వాళ్లలో వస్తుంది.
వాళ్లకి ప్రేమ, కేర్ అందేలా చూడటం ముఖ్యం. పిల్లల కోసం ఎలా అయితే కొంత టైం ఇస్తామో అలాగే పెద్దవాళ్లకి కూడా ఇవ్వాలి.
అప్పుడప్పుడు ‘మీరు మాకు ముఖ్యం’ అనే భరోసా ఇవ్వాలి. బయటికి తీసుకెళ్లటం. ఒకప్పుడు ఏదైనా చేయాలనుకొని చేయలేకపోయిన చిన్న చిన్న కోరికలు తీర్చటం వంటివి చేయాలి.
సమస్య మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ అవసరం పడొచ్చు. కానీ మెనోపాజ్ దాటి వృద్ధాప్యంలోకి వెళ్తున్న వాళ్లకి కావాల్సింది ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా. -డా. జ్యోతిర్మయి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కాంటినెంటల్ హాస్పిటల్, హైదరాబాద్
లక్షణాలు
మెనోపాజ్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒకలాగ ఉంటాయి. తొందరగా అలసిపోవడం, ఒళ్ళంతా వేడి ఆవిర్లు రావడం, ఒళ్ళంతా చెమటలు పట్టడం, రాత్రిళ్ళు నిద్రలో ఒళ్ళంతా చెమటలు పట్టి మెలకువ రావడం ఉంటుంది. కొందరిలో గుండె దడ, మానసికమైన ఆందోళన, చిరాకు, కారణం లేకుండా ఏడుపు రావడం, ఎప్పుడూ తలనొప్పిగా అనిపించటం లాంటి చికాకులు ఉంటాయి. వీటన్నిటికీ కారణం తెలియక కొందరు, కారణం తెలిసినా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇంకొందరు మెల్లగా డిప్రెషన్‌లోకి వెళ్లి పోతారు.
వర్కింగ్ ఉమెన్ లోనూ..
వర్కింగ్ ఉమెన్‌లో మెనోపాజ్ ఇప్పుడు త్వరగా వచ్చేస్తోంది. కొందరిలో 40 ఏళ్లకే మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తాయి. ఆ దశలో కూడా మెంటల్ స్ట్రెస్ పెరిగి పోతుంది. ఎక్కువగా బరువు పెరగటం, రిటైర్మెంట్ నాటికి మరిన్ని సమస్యలు రావడం మామూలే. కొందరిలో చిరాకు పెరుగుతుంది. మరికొందరికి ఒళ్లంతా ఆవిర్లు వచ్చినట్లు ఉంటుంది. వర్క్‌లో ఇంతకుముందుకన్నా వెనుకబడి పోతున్నాం అనే ఆలోచన పెరిగిపోతుంది. ఇవన్నీ లోపల్లోపలే డిప్రెషన్‌ని పెంచుతాయి. రిటైర్‌మెంట్ ఏజ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ విషయం కూడా డిప్రెషన్ కి కారణం కావచ్చు. లైఫ్ అయిపోతోంది. సేవింగ్స్ లేవు, పిల్లలు సెటిల్ కాలేదు అనే భయం కుంగదీస్తుంది. దానివల్ల కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు.
For More News..
కంప్యూటర్ వర్క్ చేసే వాళ్లు ఇలా చేస్తే చేతి వేళ్లకు బెటర్
లోడ్ చార్జీల పేర ట్రాన్స్‌కో వడ్డింపులు