‘రాచకొండ’లో యాక్టివ్​ మావోయిస్టులు లేరు : సీపీ డీఎస్​ చౌహాన్​

యాదాద్రి, వెలుగు :  రాచకొండ పరిధిలో యాక్టివ్​ మావోయిస్టులు లేరని సీపీ డీఎస్​ చౌహాన్​ స్పష్టం చేశారు. మావోయిస్టుల కదలికలు లేకున్నా పోలీసులు అప్రమత్తంగానే ఉన్నామని తెలిపారు. హైదరాబాద్​లో ఉగ్రవాద మూలాలున్న వారిని అరెస్ట్​ చేసిన విషయాన్ని ప్రస్తావించగా ఉగ్రవాదుల కదలికలు లేవని ఆయన తెలిపారు. యాదాద్రి జిల్లా భువనగిరి టౌన్​ పీఎస్​లో బుధవారం ఆయన రికార్డులను పరిశీలించి, పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాదర్బార్​కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నృసింహస్వామి టెంపుల్​ భద్రత దృష్టిలో పెట్టుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్యాంగ్​స్టర్​  నయీం కారణంగా నష్టపోయామని తమను ఎవరు సంప్రదించినా సాయం చేస్తామని ప్రకటించారు. నయీం కేసులో ఏర్పాటు చేసిన సిట్​ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఈ విషయంలో తానేం మాట్లాడనని చెప్పారు. సివిల్​ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరని చెప్పిన ఆయన కోర్టులను ఆశ్రయించాలని ఫిర్యాదుదారులకు సూచించారు. నేరాలకు పాల్పడి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న వారిని పట్టుకొని చట్టం ముందు నిలబెడుతున్నామని తెలిపారు. రాచకొండ పరిధిలో రెగ్యులర్​గా ప్రజాదర్బార్​ నిర్వహించడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. 

గతాన్ని మరిచి హుందాగా జీవించండి

గతాన్ని మరిచి సమాజంలో హుందాగా జీవించాలని రాచకొండ సీపీ డీఎస్​ చౌహాన్​ పిలుపునిచ్చారు. పాత నేరస్తులతో నిర్వహించిన ‘మార్పు కోసం- ముందడుగు’ కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు. తొందరపాటుతో కొందరు నేరాలు చేస్తారని, వీరి కారణంగా ఏ తప్పు చేయని కుటుంబం ఇబ్బందులు పడుతుందని చెప్పారు. నేరాల మానుకొని మంచిగా జీవించే వారికి పోలీసుల సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం పీఎస్​లో ఆయన క్రైమ్​ రివ్యూ నిర్వహించారు. ఇటీవల వరుసగా జరిగిన దొంగతనాలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో రాచకొండ క్రైమ్స్​ డీసీపీ మధుకర్​ స్వామి, అడిషనల్​ డీసీపీ లక్ష్మి, యాదాద్రి డీసీపీ రాజేశ్​ చంద్ర, ఏసీపీలు వెంకటరెడ్డి, నర్సింహారెడ్డి, ఉదయ్​కుమార్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.