పెద్దపల్లిలో రాత్రయితే బస్సులుండవ్‌‌‌‌‌‌‌‌ 

పెద్దపల్లిలో  రాత్రయితే బస్సులుండవ్‌‌‌‌‌‌‌‌ 

పెద్దపల్లిలో బస్‌‌‌‌‌‌‌‌ డిపో లేక ఆర్టీసీ సేవలు అందట్లే
జిల్లా కేంద్రమైనా బస్‌‌‌‌‌‌‌‌ డిపో ఏర్పాటుపై ముందడుగు లేదు 
డిపో ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌‌‌‌‌‌‌‌

 
పెద్దపల్లి, వెలుగు:
పెద్దపల్లి జిల్లా కేంద్రమైనా రాత్రయితే బస్టాండ్‌‌‌‌‌‌‌‌ నుంచి బస్సులు ఉండవు. బస్‌‌‌‌‌‌‌‌ డిపో లేకపోవడంతో జిల్లాకేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవలు అందడం లేదు. పెద్దపల్లిలో డిపో ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదు. దూరప్రాంతాల నుంచి రైలులో పెద్దపల్లి చేరుకున్న ప్రయాణికులు తెల్లారేదాకా బస్టాండ్‌‌‌‌‌‌‌‌లోనే ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం 7 దాటితే గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉండడం లేదు. దీంతో జిల్లాకేంద్రంలో డిపో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

పెద్దపల్లిలో డిపో లేకపోవడమే సమస్య 

పెద్దపల్లి జిల్లాకేంద్రంలో బస్‌‌‌‌‌‌‌‌ డిపో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవలు అందడం లేదని జిల్లావాసులు అంటున్నారు. గోదావరిఖని, మంథని, కరీంనగర్​, మంచిర్యాల  డిపోలకు  చెందిన బస్సులు కేవలం నియోజకవర్గంలోని ప్రధాన పట్టణాలు, మండలకేంద్రాలకు మాత్రమే అడపాదడపా రాకపోకలు సాగిస్తున్నాయి. అవికూడా రోజుకు ఒకటి రెండు ట్రిప్పులకే పరిమితమవుతున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాలకు బస్సులను నడుపుతున్నారు. అవి కూడా రోజుకు ఒకసారి మాత్రమే వచ్చిపోతుండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

పెద్దపల్లిలో రైలు దిగిన ప్యాసింజర్లు మంథని, ధర్మారం, సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌, జూలపల్లి, ఎలిగేడు, ఓదెల,  కాల్వ శ్రీరాంపూర్​ రూట్‌‌‌‌‌‌‌‌లో వెళ్లేవారు తెల్లారేదాకా బస్టాండులో ఉండాల్సిందే. కొన్ని మండలాలకు అయితే బస్సు సౌకర్యం లేక ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు. అదే పెద్దపల్లిలో డిపో ఉంటే పరిసర గ్రామాలకు 24 గంటలు బస్సులు నడిపే అవకాశం ఉంటుంది.పెద్దపల్లి రైల్వే జంక్షన్‌‌‌‌‌‌‌‌ కావడంతో నిత్యం బస్సుల రాకపోకలు ఏర్పాటు చేయాలని జిల్లావాసులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. గతంలో పెద్దపల్లికి డిపో శాంక్షన్ అయినా వివిధ కారణాలతో క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ అయింది.