తెలంగాణలో కరెంట్ కోతలు అనేవి అవాస్తవమని అని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతటా క్వాలిటీ విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. విద్యుత్, ఆర్థిక శాఖలను బీఆర్ఎస్ సర్కార్ అస్తవ్యస్థం చేసిందని.. ఇప్పుడు ఆ రెండు శాఖలు తమ ప్రభుత్వానికి పెద్ద సవాల్ అని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను కడుతూ.. ఫథకాలను కొనసాగిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా తప్పన్నారు భట్టి విక్రమార్క. ఫోన్ ట్యాపింగ్ అందరికీ ప్రమాదకరమని చెప్పారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుందని... త్వరలోనే అన్ని బయటకు వస్తాయని చెప్పారు.
బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విరక్తి చెంది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు భట్టి విక్రమార్క. దాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యతని చెప్పారు. పదేపదే ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే మాటలు బీఆర్ఎస్ నాయకులు అనడం సరికాదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఇమడలేక కాంగ్రెస్ లోకి వస్తున్నారని భట్టి అన్నారు.