ఏజెన్సీ దవాఖానాల్లోడాక్టర్లే లేరు

ఏజెన్సీ దవాఖానాల్లోడాక్టర్లే లేరు
  • జిల్లాలో డాక్టర్లు, సిబ్బంది కొరత
  • 44 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 20 మందే..
  • స్టాఫ్​నర్సులు 14 మంది మాత్రమే
  • అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు పరుగులు

ఆసిఫాబాద్,వెలుగు: ఆసిఫాబాద్ ​జిల్లాలోని మారుమూల పల్లెలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత కారణంగా.. గత్యంతరం లేక ప్రైవేట్ ​హాస్పిటల్స్​ను ఆశ్రయిస్తుండడంతో బడుగు జీవుల జేబులకు చిల్లులుపడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సీహెస్​సీ మొదలు పీహెచ్ సీల వరకు సరిపడా వైద్యులు, సిబ్బంది లేక 24 గంటల వైద్య సేవలు గగనంగా మారింది. గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులో లేక రాత్రి, అత్యవసర వేళల్లో ప్రాణాలు దక్కించుకునేందుకు పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అన్ని చోట్ల అదే పరిస్థితి

జిల్లాలోనే ఏజెన్సీ ప్రాంతానికి కీలకంగా మారిన జైనూర్ గవర్నమెంట్ హాస్పిటల్​లో వైద్యుల కొరత వేధిస్తోంది. డాక్టర్లు లేక ఉట్నూర్, ఆదిలాబాద్ రిమ్స్​కు రిఫర్ చేస్తున్నారు. దీంతో చేసేదేంలేక చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్​ను ఆశ్రయిస్తున్నారు. జైనూర్ ఆస్పత్రిలో ఏడుగురు డాక్టర్లు పనిచేయాలి కానీ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఇదే మండలంలోని ఉశేగాం పీహెచ్​సీలో ముగ్గురు ఉండాల్సిన చోట ఒకరే ఉన్నారు. డాక్టర్లను నియామించాలని ఇటీవల కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు ఏజెన్సీ ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. త్వరలోనే కొత్త డాక్టర్లను ఇయమిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినప్పటికీ ఇంకా ఎవరినీ నియమించలేదు. అయితే ఇక్కడ డ్యూటీ చేయడానికి డాక్టర్లు ఇంట్రెస్ట్ చూపకపోవడం వైద్యశాఖ అధికారులకు సవాల్​గా మారింది. కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులు మారిపోయాయి. గతేడాది వరకు 24 గంటల సేవలు అందేవి. ఇద్దరు డాక్టర్లు స్థానాలు ఖాళీ కావడంతో ఇప్పుడు కేవలం 8 గంటల పాటు మాత్రమే అతికష్టం మీద సేవలందిస్తున్నారు. తిర్యాణి సీహెచ్​సీ దవాఖానాలో 6 డాక్టర్ పోస్టులు ఉండగా ఒక్కరు మాత్రమే డిప్యూటేషన్​పై వచ్చి సేవలందిస్తున్నారు. దహెగాంలోని పీహెచ్​సీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

పనిచేస్తోంది 12 మంది డాక్టర్లే..


ఆసిఫాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 34 మలేరియా, 18 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వర్షాలకు జిల్లాలో జ్వరాలు ప్రబలి జనాలు దవాఖానాల్లో చేరుతున్నారు. ప్రైవేట్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నయి. ఆసిఫాబాద్ సీహెచ్​సీలో ఓపీ 400 నుంచి 500 వరకు ఉంటోంది. పీహెచ్​సీలు రద్దీగా మారాయి. కానీ డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా వారికి సరైన వైద్యం అందడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 పీహెచ్ సీల్లో సరిపడా డాక్టర్లు లేరు. 44 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 20 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురు పీజీకి వెళ్లగా, మరో నలుగురు సెలవుల్లో ఉండడంతో ప్రస్తుతం 12 మంది డాక్టరు మాత్రమే పనిచేస్తున్నారు. స్టాఫ్ నర్సులు 43 మంది ఉండాల్సిన చోట కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. ఫలితంగా రోగులకు సరైన వైద్యం అందడంలేదు. 

సిస్టర్లే గోళీలిస్తరు

జైనూర్ సర్కారి ఆస్పత్రికి ట్రీట్​మెంట్ కోసం వెళ్తే సిస్టర్లే గొళీలిచ్చి ఇంటికి పంపుతున్నరు. ఎక్కువ జ్వరం ఉంటే ఉట్నూర్​ కన్నా ఆదిలాబాద్ కన్నా పంపుతున్నారు. డాక్టర్లు లేక మాకు సరైన వైద్యం  అందడంలేదు. జైనూర్ ఆస్పత్రిలో వైద్య సేవలను మెరుగుపర్చాలి.


– మెస్రం బొజ్జుపటేల్, గౌరి గ్రామం, జైనూర్ మండలం