- ప్రైవేట్ బిల్డింగుల్లో క్లాసులు, హాస్టళ్లు
- ల్యాబ్‌కు వెళ్లాలంటే కిలోమీటర్ నడవాల్సిందే
వనపర్తి, వెలుగు : వనపర్తిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలాంటి సౌలతులు లేక స్టూడెంట్స్ అవస్థలు పడుతున్నారు. ప్రతిష్ట గల విద్యాసంస్థ అయినందున ఇక్కడ అడ్మిషన్లు క్రమంగా పెరుగుతున్నా అందుకు తగ్గట్టు వసతులు లేక పోవడం విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. మూడేండ్ల కింద పీజీ సెంటర్లో ప్రారంభించిన ఈ కాలేజీలో సీఎస్సీ, సీఎస్ఎం, సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచ్‌లున్నాయి. 2022లో 118 మంది స్టూడెంట్స్‌తో కాలేజీ మొదలుకాగా.. ప్రస్తుతం ఇక్కడ 723 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. 31 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉండగా, ముగ్గురు మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు.
సొంత బిల్డింగ్ లేదు
మూడేండ్ల కింద ఏర్పాటయినా ఇంతవరకు కాలేజీకి సొంత బిల్డింగ్ లేదు. పీజీ సెంటర్లో ఫ్టస్ఇయర్ క్లాసులు నడుస్తుండగా ఇటీవల సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్లను కిలోమీటర్ దూరంలో ఉన్న మరో బిల్డింగ్‌కు మార్చారు. పీసీ సెంటర్లోనే కంప్యూటర్ ల్యాబ్ ఉండడంతో ప్రాక్టికల్స్ కోసం సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కిలోమీటర్ దూరం నుంచి నడిచి ఇక్కడి వస్తున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో అంత దూరం నుంచి కాలినడకన ప్రధాన బిల్డింగుకు రావడానికి స్టూడెంట్స్ ముఖ్యంగా అమ్మాయిలు కష్టపడాల్సివస్తోంది.
ల్యాబ్‌లో కంప్యూటర్ల కూడా సరిగా పనిచేయడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ కోసం 2022లో నాగవరం వద్ద 45 ఎకరాలు కేటాయించారు. 2023లో రూ.4.17 కోట్లతో నిర్మాణపనులను ఒక ఏజెన్సీకి అప్పగించారు. 2 బ్లాకుల్లో బిల్డింగులు, ఒక హాల్, 2 బోర్లు, కాంపౌండు వాల్, వర్క్‌షాప్ నిర్మించాల్సిఉండగా ఏడాది అయినా పనులు ముందుకు కదలలేదు. సెకండ్, థర్డ్ఇయర్ క్లాసుల కోసం తీసుకున్న ప్రైవేట్ బిల్డింగ్‌కు నెలకు రూ 60 వేలు అద్దె చెల్లిస్తున్నారు.
ప్రైవేటు బిల్డింగులో గర్ల్స్ హాస్టల్
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు బిల్డింగులో గర్ల్స్ హాస్టల్నిర్వహిస్తున్నారు. గతంలో ప్రైవేటు ఆసుపత్రి ఉన్న బిల్డింగులో హాస్టల్ఏర్పాటు చేయడంతో అంత సౌకర్యంగా లేదని అంటున్నారు. హాస్ట్‌లో 124 మంది గర్ల్స్ ఉండగా ఒక్కో గదిలో అయిదుగురు సర్దుకోవాల్సివస్తోంది. కొన్ని గదులకు మాత్రమే అటాడ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి.
దీంతో ఇతర గదుల్లో ఉన్న అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన నీటి సౌకర్యం కూడా లేదు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా, బస్టాండు సమీపంలో బాయ్స్కే రెండు హాస్టళ్లు కేటాయిం చారు. ఎక్కడో వండి టిఫిన్, భోజనం హాస్టల్‌కు తీసుకొచ్చి వడ్డిస్తున్నారు. దీంతో క్వాలిటీ ఉండడంలేదని స్టూడెంట్స్ చెప్తున్నారు.
సమస్యలు తీరుస్తున్నాం
హాస్టళ్లలో, కాలేజీలో సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. టాయిలెట్స్‌ను శుభ్రం చేయించాం. కాలేజీ ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశాం. సోమవారం లోగా మెస్సమస్యలు తీర్చాలని మెస్కాంట్రాక్టరు పిలిపించి చెప్పాం. రామ్‌నరేష్ యాదవ్, వైస్ ప్రిన్సిపాల్