- రూ.40 కోట్లు వెచ్చించినా నిలువ నీడ లేకపాయే
- రూ.4 కోట్లతో మొక్కలు నాటినా అక్కరకు రాట్లే
- మండుటెండల్లో వెహికిల్స్ పార్కింగ్
- డ్రైవర్లకు సౌలతులు లేక ఇబ్బందులు
సూర్యాపేట, వెలుగు : నూతనంగా నిర్మించిన సూర్యాపేట కలెక్టరేట్లో కనీస వసతులు కరువయ్యాయి. రూ.40 కోట్లు ఖర్చు చేసినా నిలువ నీడే లేదు, రూ.4 కోట్లతో మొక్కలు నాటినా అక్కరకు రాకుండా పోయాయి. కలెక్టరేట్ లో కార్లు, టూవీలర్స్ ఎండలో మగ్గుతున్నాయి. డ్రైవర్లు కనీసం విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు కూడా లేదు. వందల కోట్లు ఖర్చు చేసి కలెక్టరేట్ నిర్మించిన అధికారులు కనీస వసతులు కల్పించలేదు. ఈ ఫలితంగా కలెక్టరేట్ ఉద్యోగుల నుంచి వాహనాల డ్రైవర్ల వరకూ ప్రతిఒక్కరూ ఇబ్బంది పడాల్సి వస్తోంది.
కలెక్టరేట్ లో వెహికిల్స్ పార్కింగ్ కోసం గతంలో రూ.40 లక్షలతో పార్కింగ్ షెడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రపోజల్స్ సిద్ధం చేసినా అది పేపర్లకే పరిమితమైంది. ఈ ఫలితంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఎండలోనే కార్లను పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఎండలు దంచి కొడుతుండడంతో పార్కింగ్చేసిన వాహనాల్లో నుంచి పెట్రోల్, డీజిల్ఆవిరైపోతుంది. అంతేకాకుండా తరచూ మెయింటనెన్స్ సమస్యలు వస్తున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు.
పార్కింగ్ షెడ్డు ఏర్పాటు చేయాలి..
పాత కలెక్టరేట్లో ఎటూ చూసినా పెద్ద పెద్ద చెట్లుండేవి. డ్రైవర్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు చెట్ల కింద సేద తీరేవారు. డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా షెడ్ అందుబాటులో ఉండేది. కానీ, కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ వద్ద షెడ్డు, చెట్లు లేకపోవడంతో వెహికిల్స్ బయటన పెట్టుకోవాల్సి వస్తోంది. ఆఫీసర్లు ఎప్పుడు పిలుస్తారో తెలియక డ్రైవర్లు వెహికిల్స్లోనే ఉండాల్సి వస్తోంది. ఎండలో వెహికిల్స్ పక్కపక్కనే పెడుతుండడంతో పెట్రోల్ ట్యాంకర్లలో ఫైర్ యాక్సిడెంట్జరిగితే పెద్ద ప్రమాదం పొంచి ఉంది.
వెహికిల్స్ రక్షణ కోసం పెట్రోల్ ట్యాంకులపై సిబ్బంది అట్టముక్కలు పెట్టుకోవాల్సిన పరిస్థతి ఏర్పడింది. కలెక్టరేట్ లో పార్కింగ్ షెడ్డు ఏర్పాటు చేయలేరా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పార్కింగ్ షెడ్డు, డ్రైవర్లకు రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు.