సంక్షేమ హాస్టళ్లలో సౌలతులు అంతంతే : మాజీ మంత్రి హరీశ్​రావు

సంక్షేమ హాస్టళ్లలో సౌలతులు అంతంతే : మాజీ మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రభుత్వ హాస్టళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు, చేసే పనుల్లో పొంతన లేకుండా పోతోందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సిద్దిపేట అర్బన్  మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో మంగళవారం విద్యార్థులతో ఇంట్రాక్ట్  అయ్యారు. వారికి దుప్పట్లు, టీ షర్ట్స్ అందజేసి, కేక్  కట్  చేసి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పారని, కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అంతా ఉత్తదేనని అర్థం అవుతుందన్నారు.

ఉత్తుత్తి మాటలు కాకుండా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పెండింగ్​లో ఉన్న కాస్మోటిక్, మెస్  చార్జీలు, విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలు, ఆన్​లైన్  గేమ్స్​ జోలికి వెళ్లకుండా మంచిగా చదువుకొని పేరెంట్స్​కు మంచి పేరు తేవాలని సూచించారు.

‘దావతులు వద్దు.. దాతలు ముద్దు’ పిలుపుతో ప్రభుత్వ హాస్టళ్లను దత్తత తీసుకొని విద్యార్థులకు సాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు సిద్దిపేట పీజీ హాస్టల్ లో స్టూడెంట్లకు దుప్పట్లు పంపిణీ చేశారు.