- రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటళ్లు,డిస్పెన్సరీలు ఆగమాగం
- 70 లక్షల కార్మికులు, ఉద్యోగుల అవస్థలు
- రోగులకు సరిగా అందని సేవలు
- అత్యవసర మందులూ దిక్కు లేవు
- బిల్డింగ్‌లకు కిరాయి కూడా కడ్తలేరు
- కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేవ్
- తల పట్టుకుంటున్న మెడికల్ ఆఫీసర్లు
- మందుల స్కాం నాటి నుంచీ ఇదే పరిస్థితి
- నాలుగేళ్లుగా రీయింబర్స్మెంట్రావట్లే
- సర్కారు పట్టించుకోవడం లేదంటున్న ఈఎస్ఐ ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులకు వైద్యం అందించే ‘ఈఎస్ఐ (ఎంప్లాయీస్స్టేట్ ఇన్సూరెన్స్)’ అస్తవ్యస్తంగా మారింది. ఈఎస్ఐ హాస్పిటళ్లు, డిస్పెన్సరీల్లో మందుల్లేవు, పర్యవేక్షణ లేదు. కొన్నిచోట్ల డిస్పెన్సరీలను తెరిచే పరిస్థితి కూడా లేదు. ట్రీట్మెంట్ చేయించుకున్నవారికి రీయింబర్స్మెంట్ అందడం లేదు. ఈఎస్ఐలో మందుల కొనుగోళ్ల కుంభకోణం బయటపడినప్పటి నుంచి కార్పొరేషన్ నిర్వహణ పడకేసింది. డిస్పెన్సరీల భవనాలకు అద్దె కట్టడం లేదు, కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు చెల్లించటం లేదు.
ఏ నెలకు ఆ నెల ఉద్యోగులు, కార్మికుల నుంచి వాటా సొమ్ము జమవుతున్నా, భారీగా నిధులున్నా.. సరైన సేవలు అందని దుస్థితి నెలకొంది. ఈఎస్ఐ హాస్పిటళ్లు, డిస్పెన్సరీలపై ఆధారపడే ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం బీపీ, షుగర్ ఉన్న వారికి కూడా మందులు అందడం లేదని వాపోతున్నారు.
90 శాతం డిస్పెన్సరీల్లో మందుల్లేవ్
రాష్ట్రవ్యాప్తంగా 70 డిస్పెన్సరీలు ఉండగా.. 90 శాతం డిస్పెన్సరీల్లో మందులు లేని పరిస్థితి నెలకొంది. మందులన్నీ ఖాళీ అయినా మంత్రిగానీ, ఉన్నతాధికారులుగానీ చర్యలు చేపట్టడం లేదని సిబ్బంది మండిపడుతున్నారు. సాధారణంగా ఒక్కో డిస్పెన్సరీకి 292 రకాల మందులు రెగ్యులర్ గా సరఫరా అవుతాయి. నెల కిందటే అందులో 161 రకాల మందుల సప్లై ఆగిపోయింది. ఎమర్జెన్సీ మందులు కొనుగోలు అంతకుముందే ఆగిపోయింది. ఎన్నిసార్లు ఇండెంట్ పెట్టినా పట్టించుకునేవారు లేక.. డిస్పెన్సరీల ఇన్చార్జులు తల పట్టుకుంటున్నారు. చేసేదేమీ లేక ఔట్ పేషెంట్ చూస్తూ, మందులు బయట కొనుక్కోవాలని సూచిస్తున్నారు. దీంతో ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 10 ఈఎస్ఐ డిస్పెన్సరీల ఇన్చార్జులు తమ వద్ద మందులు అయిపోయాయని, డిస్పెన్సరీలు తెరిచే పరిస్థితి లేదని ఉన్నతాధికారులకు లెటర్ రాయడం గమనార్హం. అయినా స్పందనేదీ లేదు.
డైరెక్టర్, జేడీ అరెస్టులతో..
ఈఎస్ఐలో మందుల కొనుగోలు కుంభకోణం జరిగినట్టు ఫిబ్రవరిలో గుర్తించారు. దానిపై ఇంటర్నల్ ఆడిట్ చేపట్టారు. కొత్తగా మందుల కొనుగోళ్లపై అప్పటి డైరెక్టర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కట్టడి చేశారు. మందులతోపాటు కిట్స్, వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగినట్టు మే నెలలో నిర్ధారించారు. దీంతో సెప్టెంబర్ లో డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మజ, కొందరు ఈఎస్ఐ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఇటు ఉన్నతాధికారుల్లేక, అటు అక్రమాల వ్యవహారం భయంతో.. కిందిస్థాయి ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా హడలిపోతున్నారు.
ఆఫీసులో అడుగుపెట్టని ఇన్చార్జి..
ఈఎస్ఐ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ అరెస్టు కావడంతో.. నెలన్నర కింద ఆ బాధ్యతలను ఐఏఎస్ అధికారి నదీమ్ అహ్మద్ కు బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పటివరకు ఆయన ఈఎస్ఐ ఆఫీసు గడప తొక్కలేదు. ఈఎస్ఐపై మంత్రి నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కు కూడా ఆయన రాలేదని సమాచారం. భారీగా అక్రమాలు బయటపడుతుండటం, మందుల కొనుగోళ్ల ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. దాంతో సమస్యలు తీరడం లేదు. కనీసం మందుల కొరతనైనా తీర్చాల్సి ఉన్నా మంత్రిగానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
రెంట్ కట్టరు.. జీతాలివ్వరు..
మందుల సరఫరా ఒకటే కాదు. ఈఎస్ఐలో ప్రతి దశలోనూ నిర్వహణ కుంటుపడింది. డిస్పెన్సరీలకు అద్దె చెల్లించే నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. రాష్ట్రంలోని 70 డిస్పెన్సరీలకుగాను దాదాపు 60 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వాటికి ఏడు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఆయా భవనాల యాజమానులు డిస్పెన్సరీల ఇన్చార్జులతో గొడవకు దిగుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఓ డిస్పెన్సరీ ఉన్న భవనం యజమాని వెంటనే ఖాళీ చేయాలంటూ మెడికల్ ఆఫీసర్ తో గొడవ పెట్టుకున్నారు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉందని, ఎన్నాళ్లని అద్దె చెల్లించకుండా ఉంటారని ఉద్యోగులు అంటున్నారు.
ఈఎస్ఐలో కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్ఐలో 1,090 మంది కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. వారికి ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
రిఫరెన్స్‌పై బయటి ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. దాదాపు నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్నామని, డబ్బులు రావడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ రీజియన్ లో జాయింట్ డైరెక్టర్ అరెస్టు తర్వాత ఎవరికీ బాధ్యత అప్పగించలేదు. కనీసం ఉద్యోగుల లీవ్ ఫైల్ కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
ఇదీ పరిస్థితి
- రాష్ట్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీల సంఖ్య 70
- 90 శాతం డిస్పెన్సరీల్లో మందులు నిల్
- అత్యవసర మందులను కూడా కొనలేని పరిస్థితి
- రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటళ్లు, డిస్పెన్సరీలపై ఆధారపడినవారి సంఖ్య 68 లక్షలు
- తొమ్మిది నెలలుగా సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి
- 1,090 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏడు నెలలుగా జీతాల్లేవు
- చందాదారులకు నాలుగేళ్లుగా మెడికల్ రీయింబర్స్మెంట్ లేదు
ఈఎస్ఐ పరిధిలో ఎవరెవరు?
- ప్రైవేటు రంగంలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఆరోగ్య బీమా అందించేందుకు కేంద్రం ‘ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ)’ని నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగంలో రూ.21 వేలకన్నా తక్కువ వేతనం ఉన్న కార్మికులు, ఉద్యోగులకు ఈఎస్ఐ పథకం వర్తిస్తుంది.
- 10 మంది, అంతకన్నా ఎక్కువ మంది సిబ్బంది ఉండే పరిశ్రమలు, సంస్థలు, హో టళ్లు, షాపులు, రెస్టారెంట్లు సహా అన్ని ప్రైవేటు సంస్థలు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.
- ఈ బీమా కోసం ఉద్యోగుల వేతనంలో నాలుగు శాతాన్ని ఈఎస్ఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 0.75 శాతం ఉద్యోగులు, మేనేజ్మెంట్ మిగతా 3.25 శాతం భరిస్తాయి.
- ఈఎస్ఐ కింద కార్మికులు, ఉద్యోగులతోపాటు వారి తల్లిదండ్రులు, పిల్లలకు కూడా ఉచిత వైద్యం అందిస్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఈఎస్ఐ హాస్పిటళ్లు, డిస్పెన్సరీలను నిర్వహిస్తోంది.
- తమవద్ద అందించలేని చికిత్సలను ఇతర ప్రైవేటు హాస్పిటళ్లకు రిఫర్ చేస్తుంది. ఆ మేరకు సొమ్మును రీయింబర్స్మెంట్చేస్తుంది.
- రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కలిపి సుమారు 70 లక్షల మందికిపైగా ఈఎస్ఐ పరిధిలో ఉన్నారు.
సర్కారు నిర్లక్ష్యంతోనే
ఈఎస్ఐలో పరిస్థితి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో సర్కారు విఫలమైంది. లక్షల మంది ఉద్యోగులు, కార్మికుల వైద్యానికి సంబంధించినది అయినా ఏ మాత్రం పట్టించుకోలేదు. డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ల నిర్ణయాలకు కోత విధించిన తర్వాత.. రోజువారీ కార్యకలాపాలు, మందులు, జీతాలు, అద్దె కు సంబంధించి నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఎవరికీ అప్పగించలేదు. దాంతో అన్ని నిర్ణయాలు పెండింగ్ లో పడిపోయాయి. డైరెక్టర్, జేడీ అరెస్టయ్యాక సీనియర్ ఐఏఎస్‌కు బాధ్యతలు అప్పగించినా ఆయన ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. వారం రోజుల్లో మందుల కొనుగోలు, జీతాలు, అద్దెకు సంబంధించి సమస్యలు తీరుస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు పర్చేజ్ ఆర్డర్ పెట్టినా మందులు రావటానికి నెల రోజులు పడుతుందని అంచనా.
ఉద్యోగులు, కార్మికుల హెల్త్‌పై ఇంత నిర్లక్ష్యమా?
‘‘ఈఎస్ఐలో పాలన ఆగిపోయింది. 9 నెలల నుంచి సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోవడం లేదు. దీనిపై మంత్రికి రెండుసార్లు విన్నవించినా సమస్య తీరలేదు. ఎంప్లాయీస్ ఖాతా నుంచి ఈఎస్ఐ డబ్బులు కోత విధిస్తూ.. వారికి సరైన సేవలు అందించకపోవడం ఏమిటి? నిధులు ఉండి కూడా నిర్ణయాలు తీసుకోవడంలో ఇంత జాప్యమా? కొత్త డైరెక్టర్ వచ్చినా పరిస్థితి మారలేదు. ఈఎస్ఐలో ఏం జరుగుతోందో ప్రభుత్వ పెద్దలకైనా తెలుసా. దాదాపు 70 లక్షల మంది ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఇంత నిర్లక్ష్యం సరికాదు’’
– ఎం.శ్రీనివాస్, సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి